పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అతివనునుగౌ నదృశ్యవశ్యాదికళలఁ దనరి మృగరాజజయలీలఁ దగిలియున్న
సుందరత నొంది పెంపు మిన్నంది యట్లు, లేమిచే ముష్టిపట్టుట కేమిగతమొ.

131


క.

కనఁబడునఁట సగుణస్థితిఁ, గనరాదఁట నిర్గుణాప్తిఁ గలదో లేదో
కనకాంగినడుముపోలిక, యెనయఁ జిదంబరరహస్య మెవ్వఁ డెఱుంగున్.

132


వ.

అని తలంపుచు మోహావేశంబున.

133


క.

అపు డయ్యింతిం గనుఁగొని, యపరిమితానందహృదయుఁ డై యి ట్లనియెన్
గపురంపుఁజలువపలుకులు, చపలాంబకవీనులకు రసాయనములు గాన్.

134


సీ.

ఉవిద నీకొప్పు నీలోత్పలంబులగుంపు భామ నీకన్నులు పంకజములు
లలన నీనాస తిలప్రసూనము మధూకములు నీచెక్కిళ్లు కమలగంధి
తెఱవ నీ ముద్దువాతెఱ పాటలము మల్లెమొగ్గలు నీదంతములు మృగాక్షి
వెలఁది నీ పాలిండ్లు విరిచెండ్లు బంధూకములు నీకరంబులు ముద్దుగుమ్మ


తే.

నెలఁత నీమేను సంపెంగ నీ పదములు, హల్లకము లింతి సుమనోలతాంగి నిన్నుఁ
బువ్వుగమి నిర్మి౦చెఁ బో విధాత, చాన నీపొందు పుష్పపూజాఫలంబు.

135


సీ.

కులుకువెన్నెలనవ్వు చిలుకు చెక్కిళ్లకుఁ దళుకుముత్యంపుఁ గమ్మల మెఱుంగు
కెంపుసంపద పెంపు నింపు లేమోవికి వీటికారసరాగవిభ్రమంబు
ఖంజనప్రతిమానరంజనం బగుచూడ్కి కంజనరేఖాసమాశ్రయంబు
మురిపెంపుసంపెంగ విరిపెంపుగలమేని కమలకాంచనదుకూలానుభూతి


తే.

గలిగి నైసర్గికమున కుత్కర్ష మెసఁగ, వెలఁది నీరూపు చూడ్కికి విందులొసఁగెఁ
గలిమిగలచోట మఱియును గలిమి గలుగు, ననినజనవాక్యమునకు దృష్టాంతముగను.

136


సీ.

చంద్రసారమె గాదు చంద్రసారముఁ గూర్చి చేసెఁ గాఁబోలు నీచిన్నినవ్వు
కమలలీలయ కాదు కమలలీలయుఁ గూర్చి కల్పింపఁబోలు నీకన్నుదోయి
సరసహేమమె కాదు సరసహేమముఁ గూర్చి విరచింపఁబోలు నీవిమలమూర్తి
సత్ప్రవాళమె కాదు సత్ప్రవాళముఁ గూర్చి యొనరింపఁబోలు నియోష్ఠబింబ


తే.

మంబురుహసూతి సృజనకాలంబునందుఁ, గాక యిట్టియదృష్టపూర్వైకమోహ
నాంగసౌభాగ్య మమర నరాహిరాజ, కన్యలకుఁ గల్గనేర్చునె కమలవదన.

137


సీ.

వనిత నీచూపులవాఁడికి నోడి మన్మథమార్గణములు సూనంబులయ్యె
సుదతి నీ చిఱునవ్వుసొగసున కోడి వెన్నెల కౌముదీవచనీయమయ్యె
లలన నీస్వనమంజులతకు నోడి పికస్వనంబులు పంచమత్వంబు నొందె
యువతి నీనడకల కోడి హంసీపదన్యాస మౌదాసీన్య మనుభవించె