పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇయ్యంతి కోర్కి సఫలం, బయ్యెడు నని యనునయించి యధిపతి కడకుం
జయ్యన నరిగి మృదూక్తులఁ, దొయ్యలివృత్తాంత మతనితోఁ దెల్పుటయున్.

114


ఉ.

ఆపలుకుల్ సుధారససమంచితసారములై చెవుల్ సొరన్
భూపతి యాత్మహర్షరసపూర్తికి నేమనవచ్చుఁ బూర్వసం
తాపదశాకృశశ్లధకనత్కటకాంగదముద్రికాదిర
త్నోపలభూష లంగములయుబ్బునఁ బొల్చెను బిక్కటంబులై.

115


తే.

ఉల్లమునకు నిండారులై వెల్లివిరియఁ, బొందునానందరసవార్ధిబుద్బుదంబు
లనఁగ దట్టంబులై పులకాంకురంబు, లవయవంబులఁ బొడమంగ నవ్విభుండు.

116


మ.

చిరకాలంబుననుండియున్ హృదయరాజీవాంతరాళంబునన్
హరిజుం డేసిన చిల్కుటమ్ముగతి సమ్యక్కీలితం బైన ని
ర్జరబిబ్బోకవతీలలామవిషయేచ్ఛాబద్ధసంకల్ప మీ
శ్వరుఁ డీడేర్పఁ దలంచె నేఁటి కనుచున్ సన్మిత్రుతో నిట్లనున్.

117


ఉ.

ఈచపలాక్షిరూపము సుమీ మును చిత్రపటంబునందు నేఁ
జూచి విరాళినొందుట కిశోరమృగేక్షణ యీలతాంగి దృ
గ్గోచరమయ్యే నిచ్చట నకుంఠితభాగ్యగతిన్ విలంబ మే
లా చతురత్వ మేర్పడ విలాసినిపొందు ఘటింపఁజేయుమా.

118


వ.

అనినం జతురమతి యమ్మహీపతి కి ట్లనియె.

119


మ.

జగతీనాథకులావతంస వినుమా సంకల్పసిద్ధుండ వీ
వగుటన్ నీదుమనోరథంబు సఫలం బౌ సంశయం బేల బా
ళిగ నిచ్చోఁ గలవింతలెల్లఁ గనుపోల్కిన్ దత్సమీపంబునం
దగురీతి విహరింపుచుండ నవలా తానే నినుంజేరెడున్.

120


చ.

అనవుడు సంతసించి మనుజాధిపుఁ డాప్తసహాయుఁడై బుగు
ల్కొనియెడు తావులం బొలుచు క్రొవ్విరితేనియ లాని ఝంకృతి
ధ్వను లొనరించుతుమ్మెదకదంబముచేఁ జెలువొందుపూఁబొదల్
గనుఁగొనుచు న్నిలింపగణికాస్థితకుంజముచెంత కేగినన్.

121


ఉ.

సిగ్గును వేడ్కయున్ బెరసి చీఁకటివెన్నెలలై మొగంబులో
జగ్గొకవింత సేయ నృపుసన్నిధి నౌఁదలవాంచి నీకుఁ దా
మొగ్గితి నంచుఁ దెల్పుగతి మ్రొక్క లతాంగి పతాకయుగ్మస
మ్యగ్గరుడోపలాంకవలయాంకితహస్తఘటల్లలాట యై.

122