పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తత్ప్రతిభన్ రహించు నఁట ధాత్రిఁ బురూరవుతోడ సాటికిన్
సత్ప్రభుతావిశేషమునఁ జర్చలు సేయఁగ నెవ్వ రంగనా.

104


సీ.

ధరణీశునకుఁ బట్టుధవళాతపత్రంబు నీడకు లోనుగా నిలుచుచనువు
రాజుగూర్చుండెడి రత్నసింహాసనం బొరసి చెయ్యూనుక యుండుచనువు
జననాథునకు వీచుచామరంబులగాడ్పు తుదులుమైఁ బొలయంగఁ గదియుచనువు
నధిపుతో నేకాంత మాడువారల విన్నపముల కౌఁగాదని పలుకుచనువుఁ


తే.

గలిగి వర్తింతు నెప్పుడు గారవమున, రాజరాజైన యప్పురూరవునిమ్రోల
ననుఁగుఁజెలికాఁడ నెంతయు నతని కేను, జతురమతి యండ్రు నాపేరు చంద్రవదన.

105


తే.

అమ్మహారాజుసఖ్యసౌఖ్యానుభూతి, గల్గు టెవ్వరికైన భాగ్యమునఁ జుమ్ము
మనసుగలవారి కతనిసంబంధ మేను, ఘటన సేయంగఁ జాలుదుఁ గమలవదన.

106


వ.

అని పలుకుచున్నంత.

107


చ.

హృదయము ఝల్లుఝల్లు మనియెం బులకాంకురపాళి నెమ్మెయిల
బొదలెఁ బ్రమోదబాష్పజలపూరము కన్నుల నిండె నార్ద్రసం
పద వహియించెఁ గంతువిడి పట్టు పురూరవురాకఁ దెల్పుత
న్మృదువచనాక్షరంబు లెలమిం జెవి సోఁకినయంత నింతికిన్.

108


తే.

అట్లు రాగప్రవాహమగ్నాంతరంగ, యగుచు మందాక్షసంకుచితావలోక
నాంచలంబుల నిజవయస్యాలలామ, చూడఁ దద్భావ మెఱిఁగి యాప్రోడవనిత.

109


వ.

అమ్మంత్రికుమారునితో ని ట్లనియె.

110


సీ.

అనఘాత్ముఁ డైన నారాయణయోగీంద్రునూరుదేశంబున నుద్భవిల్లె
సకలకళ్యాణభాజనమై వెలింగెడు నమరావలీస్థలి నధివసించెఁ
బ్రౌఢి గాంధర్వాప్సరఃకళావతులకు నాయకురాలితనంబు గాంచె
నృత్యసంగీతసాహిత్యపాండిత్యాప్తి మేటివేల్పులచేత మెప్పువడసె


తే.

నుర్వశి యనంగ నొప్పు నీయుత్పలాక్షి, యరయ నీయింతచెలికత్తియలము మేము
ధారుణీస్థలి నొకనిమిత్తమున నిట్లు, సంచరింపంగవలసె నీచంద్రముఖికి.

111


చ.

విను మిఁక దాఁపనేల నయవిశ్రుతుఁడైన పురూరవక్షితీ
శునిగుణముల్ జగజ్జనవచోరచనశ్రుతిరంజనంబుగా
విని విని దర్శనంబునకు వేడుకనొందుచు నున్న మాఘన
స్తని కతఁ డిందు వచ్చుట నిదానముగాదె యభీష్టసిద్ధికిన్.

112


క.

అని సాభిప్రాయంబుగ, వనజానన పలుక మనుజవరు విహృతినెపం
బున నిక్కుంజసమీపం, బునకుం గొనివత్తు వినయమునఁ గనుఁగొనుఁడీ.

113