పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గననయ్యెన్ రుచిరాంగుళీవలయరేఖాలక్ష్యమాణాంఘ్రినూ
తనవిన్యాసము లంగనాజనవనాంతక్రీడ సూచింపుచున్.

84


క.

ఆజాడం జనిచని యా, భూజాని లసద్రసాలభూజానీక
భ్రాజితభువి శశికాంతపు, రాజగతి వసించి యున్నరాజనిభాస్యన్.

85


చ.

చుక్కలలోని చంద్రకళసొంపున నారమణివ్రజంబులో
జక్కనినాయకోపలము చందమునం జెలికత్తెపిండులో
నక్కజపున్ విలాసమున నందముగుల్కెడు నుర్వశీపయో
ముక్కచదృక్కుచస్థితివిమోహితపూరుషఁ గాంచె ముందరన్.

86


క.

చూచి సలోలవిలోలా, లోచనుఁ డయి ముందు తా విలోకించిన లీ
లాచిత్రరూపవిభవం, బీచెలువదిగా యటంచు నెంతయు వేడ్కన్.

87


ఉ.

అగ్గజరాజకుంభకుచయందము చందము డెందముం దమిన్
మొగ్గఁగఁ జేయ డాయఁ జనుముచ్చట నచ్చట నిల్చి శంకతో
నగ్గలికం గనుంగొనఁగ నత్తఱి బిత్తరి చూచె మోముక్రొ
న్నిగ్గునిగన్నిగల్ తళుకు సిద్దపుటద్దపుసొంపు నింపఁగన్.

88


క.

తరుణియు రమణుఁడు నొండొరు, సురుచిరగతి నదరిపాటఁ జూచిన చూపుల్
మరుఁ డేమఱించి యేసిన, శరములక్రియ మానసములు జల్లనిపించెన్.

89


తే.

రమణి రమణీయరూపాభిరాము నతనిఁ, గాంచి కాంచలతాలంబిఘంటికాచి
రత్నరత్నతులాకోటిరవ మెసంగ, సారసారంగలోలదృగ్జాల యగుచు.

90


ఉ.

దిగ్గున లేచి శంకితమతిన్ శశికాంతశిలావితర్దికన్
డిగ్గి బెడంగుగుబ్బలు నటింపఁగఁ గౌను వడంక వేడ్కతో
సిగ్గు మొగంబునన్ మొలవఁ జెంత నికుంజము చాటుకేగె స
మ్యగ్గమనంబునం జకితహంసికలీల సఖీసమేత యై.

91


క.

నడుపువగ పిఱుఁదుపొంకము, నడుముసొబగు వెన్నుచెన్ను నవకపుజిగి కీ
ల్జడతీరు విభునికన్నుల, కడలించెఁ బ్రియంబు మగువ యటు మరలునెడన్.

92


తే.

ఇట్లు పొదరింటిమాటున కేగి నిలిచి, యింతచక్కనిపురుషుని నెందుఁగాన
మితనిఁ జూడఁ బురూరవుండే యటంచుఁ, దోఁచుచున్నది యని వాంఛతోడ మఱియు.

93


క.

తరుణి తదీయనికుంజాం, తరసంధులు గానవచ్చు ధరణీశ్వరుసుం
దరమూర్తి నిలోకింపుచు, మరువేదన కగ్గమగుచు మది నిట్లనియెన్.

94


సీ.

కిసలయారుణకాంతి బిసరుహంబులఁ గూర్చి విరచించెనో వీనిచరణయుగము
నీలంపుఁజకచకల్ రోలంబములఁ గూర్చి కల్పించెనో వీనికచభరంబు