పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఎవ్వనికి వలచునో యెల, జవ్వని తద్రూపలిఖితచారుపటం బె
ట్లవ్వనిఁ జేరెనొ హరుచే, నొవ్వని మరుశక్తి యనిఁ జనుంగద దానిన్.

30


చ.

అరయఁగ నాలతాంగి లిఖితాంగ మచేతనమయ్యు డెందమున్
గరఁగఁగ జేయుచున్నయది కన్గొనినంతనె హంసయానమున్
సరసమృదూక్తులుం గులుకుచల్లెడుచూపులు గల్లియొప్పు న
త్తరుణిసచేతనాంగము నెదంగదియించిన సౌఖ్య మెట్టిదో.

31


వ.

అని యనేకప్రకారంబుల మదనవికారం బొదవించువిచారంబున నక్కాంతవృత్తాం
తంబు దెలియుటకై వితర్కించుచు.

32


సీ.

పటముచెంత నయో సుపర్వాంగనోత్తమా యని వ్రాసియున్న దివ్యలిపివలన
క్షితిపకన్యాశ్రేష్ఠ చిత్రసంగతిపటం బునుప విచిత్రమై యుంటవలన
జనలోకశిల్పకుల్ గని నిర్జరీలేఖ యని నిశ్చయించినయందువలనఁ
బ్రాసంగికమున నారదుఁడు మున్నప్సరోజనము వర్ణించి పేర్కొనుటవలన


తే.

భావిసంబంధమున కభిప్రాయమైన, తలఁపుగొలుపు ఋణానుబంధంబువలన
నతనిమది దోఁచెఁ దచ్చిత్రితాంగలీల, యుర్వశీకాంతరూపు గానోపుననుచు.

33


క.

ఏరీతినయిన నాలల, నారత్నముతోడి పొందొనర్పవలయు నం
చారాజశేఖరుఁడు మది, నారనితమి సాత్త్వికోదయముగా నుండెన్.

34


క.

అంత నతాంతనితాంతల, తాంతవనాంతర్నిశాంతహరిదంతసమా
క్రాంతరవకాంతముదితా, నంతశకుంతము వసంత మాగతమయ్యెన్.

35

వసంతఋతువర్ణనము

తే.

ప్రాదళమ్ములన్ మలినాంబరము విడిచి, కట్టెఁ గెందలిరాకుచెంగావివలువ
వనరమాదేవి మాధవస్వామిరాక, కపుడు వాసకసజ్జిక యగుటఁ జేసి.

36


సీ.

తలిరుజొంపముపేరఁ బులకాంకురము లూనుఁ బువ్వులపేర లేనవ్వు నవ్వు
నలరుఁదేనియపేర హర్షాశ్రువులు నించు నళిపాళిపేరఁ గొ ప్పలవరించుఁ
బుప్పొడిపేర సొంపుగ గందవొడి పూయుఁ జిల్కపల్కులపేరఁ జెలులఁ జీరు
ఫలరాజిపేర దీప్తమణిభూషలు దాల్చుఁ బరభృతధ్వనిపేరఁ బాట పాడుఁ


తే.

జిరసమాగతమాధవవరసమాగ, మోదితావ్యాహతౌత్సుక్యమున వనీర
మారమణి మేలుపడినకోమలులచేష్ట, లట్టులౌఁగద ప్రాణనాయకులయెడల.

37


ఉ.

నూతనపుష్పితక్రమమనోహరయౌవనరేఖఁ బల్లవ
వ్రాతము గూడి కొమ్మలు విరాజితలీల నెసంగునత్తఱిన్