పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఉత్కంఠాతిశయంబుల, నుత్కంఠాభిముఖు లగుచు నుడుపోదయనం
దత్కైరవదళనయనలు, దత్కైరవరాగ మనుసుదర్శనపరతన్.

13


వ.

ఉన్నంత.

14


సీ.

భగవత్కథానులాపప్రసంగతఁ దనశుకనామము మహార్థశోభితముగ
వైమానికుల ఱెప్పపడనికన్నులు తనతనులీలఁ జూచి సార్థకము నొంద
నరవిందరాగరాగాసనద్యుతి తనకరుణారసవ్యాప్తిగతి వెలుంగఁ
జాంచల్యరహితవీక్షావిలాసము తనగాంభీర్యగుణసూచకంబు గాఁగఁ


తే.

జిలుకఱేఁడు నభోంతరసీమనుండి, డిగ్గి చనుదెంచి వ్రాలెఁ బటీరగంధు
లున్నవనిశాఖశాఖపై నొఱపుమేని, పసిమిగారుడమణిపరంపరల నీన.

15


వ.

అప్పుడు.

16


ఉ.

పెన్నిధిఁ గన్న పేదగతిఁ బెంపున నుర్వశి హర్షసారసం
పన్నవికాసమానముఖపంకజయై తగ లేచి మ్రొక్కినన్
మన్ననతో శుభం బొసఁగుమాటల దీవన లిచ్చి కెంపురా
వన్నియుమోముపుల్గు మృదువాక్ఫణితిం జెలితోడ నిట్లనున్.

17


క.

నీలాలక జాలింబడ, నేలా యిఁక నీదుకోర్కు లీడేరఁగ భూ
లావతంస మిచటికి, వాలాయము వచ్చు మేలువాఁ డగునీకున్.

18


వ.

మఱి యొకయుపాయం బెఱింగించెద సకలావయవసంపూర్ణసరససౌందర్యసౌభాగ్య
సముదారంబగునీయాకారంబు పటంబున స్ఫుటంబుగా వ్రాయించి యారూపం బప్పు
రూరవునికి దృగ్గోచరం బగునట్లు చేసినం ప్రేమాంకురం బతనిహృదయంబున నుద
యంబై పూర్వానురాగనివానం బగునాగమిష్యమాణవసంతసమయంబున నమ్మహీకాం
తుండు వనాంతరంబునకు విహారోత్సుకస్వాంతుండై యేతెంచి నిన్నుఁ గాంచి
శోభావైభవపరాభూతచంచలంబులగు తావకదృగంచలంబులకు సహాయంబుగా
విజృంభించి జళిపించు నించునిలుతుని ఖడ్గాంచలధగద్ధగలచే సంచలితమానసుండై
నీతోడికూటమి వాటించు ననేకసమవేకసమం బగుస్నేహమోహంబులఁ గ్రీడిం
చెద రని చెదరని మనస్తాపంబు దీఱ నూఱడించి యారాజకీరంబు ముదితాముదితవా
రంబై మేఘద్వారంబుననుండిన ప్రచారంబున సరి గెఁ దదనంతరంబ శిల్పకళావిశేషం
బున వలంతియగు పొలంతియొక్కతె యన్నెలంతరూపంబు శృంగారరసానురూపకం
బుగా లిఖయించి యవ్విచిత్రపటంబు గైకొని నిజమాయాబలంబుల నెవ్వరు నెఱుంగ
కుండ నమ్మహీజానిరాజధాని యుపాంతంబున భూకాంతునివిహారస్థానం బగునుద్యా