పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము



హరినీలసముజ్జ్వల
దేహద్యుతిజాల వినతదిక్పాలచతు
ర్వ్యూహస్ఫుటలీలజగ
న్మోహన గోపాలరణితమురళీలోలా.

1


వ.

అవధరింపుము సమస్తసద్గుణసాంద్రు లగు శౌనకాదిమునీంద్రులకు సామోదహృదయ
జలజాతుండై సూతుం డిట్లనియె నట నూర్వశీసౌగంధికగంధి యవ్వసుంధరా
రమణుసంబంధంబునకై సంధిల్లుప్రేమబంధంబున నంతంతకు నగ్గలించుదురంత
చింతాభరపరిశ్రాంతి నెంతయు నలసి సొలసి బాహులతాద్వయావలంబితాంస
భాగోభయపార్శ్వగతప్రాణసభయుగళాధీనశరీరయై యపాటవమాంద్యగమనం
బున వనాంతరంబులఁ బరిభ్రమించుచు హృదయాంతరాళంబున ననస్తమితస్థితి
నశ్రాంతప్రకాశమానంబై తపింపజేయు విప్రలంభప్రద్యోతనద్యోతంముద్య
మంబువలనం గాలనిరూపణంబు దెలియక నిమేషంబులు మాసంబులుగా గ్రహిం
పుచు నకలంకమీనాంకబిరుదాంకగీతికలు నిశ్శంక నంకించి పొంకంబుగాఁ బలుకు
చిలుక గొరువంక కోయిలమూఁకల కలకలంబుల కులుకుచు వికసితకుసుమవిసరపరి
చ్యుతపరాగపటలసాంద్రస్థలంబులు నిదాఘమధ్యందినాతపతప్తసికతాతలంబులుగా
నడుగిడ నలుకుచు మరందంబులకై ముసరుమిళందమ్ముల నందమ్ములై యమందపరి
మళానందకందమ్ము లగుకెందమ్ములందనరు నరవిందాకరబృందములగు చందమ్ములం
గని సధూమాంగారకుందమ్ములుగా విచారించి తొలంగుచు మరుత్పరంపరాకంప
మానవిశాలరసాలసాలప్రవాళజాలలీలాఖేలనంబులు శంబరాంతకుండు శాంబరీవిడం
బనంబున బహుముఖంబులు జళిపించు కౌక్షేయకవిక్షేపంబులుగాఁ దలంచి కలం
గుచుఁ దిరిగి తిరిగి వింధ్యపర్వతప్రాంతంబునఁ జైత్రరథోపమానం బగునొక్కవిచిత్రో
ద్యానంబు చేరి భద్రోపమానస్వచ్ఛతరచ్ఛాయాతరుచ్ఛాయాతలంబునం గూర్చుండి