పుట:కవిరాక్షసీయము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టీ.

శబ్దశక్త్యైవ - శబ్ద = శబ్దములయొక్క, శక్త్యైవ = చెప్పఁదగిన యర్థములను జెప్పెడిసామర్థ్యముచేతనే, సర్వదా = ఎప్పుడును, నవనిర్వృతిం = నూతనసుఖమును, కుర్వాణా = చేయుచుండెడి, కావ్యవిద్యా = గుణాలంకారసహితంబై యప్రయుక్తాది దోషరహితంబైన కవిత్వవిద్య, ప్రతిగతా = చెవికి వినఁబడినదియై, మృతస్యా౽పి = మూఢునకుఁగూడ (ఇందు మృతశబ్ద ముపచారవృత్తిచే మూఢునిపరం బగును), జీవనీ = జీవము గలుగఁజేయునది, స్యాత్ = అగును. (అనఁగా సంతసింపఁజేయునది యగును.)


అర్థాంతరము.

శబ్దశక్త్యైవ - శబ్ద = ఉచ్చారణముయొక్క, శక్త్యైవ = మహిమకారణముచేతనే, సర్వదానవనిర్వృతిం - సర్వదానవ = సమస్తరాక్షసులయొక్క, నిర్వృతిం = మరల బ్రతికించుట యనెడిసౌఖ్యమును, కుర్వాణా = చేయుచుండెడి, కావ్యవిద్యా - కావ్య =శుక్రునియొక్క (‘శుక్రోదైత్యగురుః కావ్య' అని యమరము.), విద్యా= సంజీవినీవిద్య, శ్రుతిగతా = చెవినిఁ బొందినదియై, మృతస్యా౽పి = చచ్చిన రక్కసులబలమునకుఁ గూడ, జీవనీ = జీవం బొసంగునది, స్యాత్ = అగును.


తా.

రాక్షసులకు గురువగు శుక్రాచార్యుఁడు ఏలాగున తనసంజీవినీవిద్యయొక్క యుచ్ఛారణమాత్రముచేతనే యుద్ధమందు మృతులగు దైత్యులను జీవింపఁజేయుచు వారికి నూతనసుఖమును గలుగఁజేయునో, ఆలాగుననే కవిత్వము చెప్పెడిపండితుఁడు తనశబ్దశక్తిచేత నూతనసుఖములును గలుగఁజేయుచు వినికిచేతనే మృతప్రాయు లగు మూఢులకుఁ గూడ సంతోషము నొనర్చును.

మఱియు పూర్వము శుక్రుఁడు మృతసంజీవినియను నొకవిద్యను నేర్చుకొని యందుచే మృతులగు దైత్యులను బ్రతికించుచుండఁగ దేవత లావిద్యను గ్రహించుటకు బృహస్పతి సుతుఁడగు కచుండనువాని శుక్రునియొద్దకు బంపఁగా నతఁడు గురువు నారాధించి యావిద్యను బడసె నని భారతమున నాదిపర్వమునఁ జెప్పంబడినది. ఈవిద్య కేవల మంత్రోచ్చారణము మంగనుత్రపూతమగు నౌషధముగను ప్రయోగించుటచేతను సిద్ధించును.ఇదియు గాయత్రీమంత్రగర్భితంబగు మృత్యుంజయమంత్ర మై యొప్పియున్నది. దీనివిధానంబు కౌతుకరత్నభాండాగారం బను గ్రంథమున 308 - 309 పుటములందును, రసరత్నాకర మంత్రఖండమందును జూడందగును.


అవ.

కావ్యంబు సుందర మనుట వివేకులయంద వెల్గు నని చెప్పుచున్నాఁడు:—


శ్లో.

కల్యాణవర్ణపదతాం వా గ్విద్యు దిప భిభ్రతీ,
అజ్ఞానేషు సదాసారసంగిషు స్యా త్స్ఫురద్గుణా.

3