పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

యడిగెనఁట. ఇట్టి ప్రాసంగిక పద్యములు వందలకొలఁది మాప్రాంతమున మిక్కిలి ప్రచారములో నున్నవి. దూషణ భూషణ ప్రసంగాదులయందు సూరకవి చెప్పుచుండిన పద్యములు తఱుచుగాఁ గందములే. ఈతని కందములు కవిత్వవసంతమాకందములు. పూర్వము కవిచౌడప్పశతకకారుఁడు కందపద్యరచనయంచుఁ దాను దిక్కనకంటె ఘనుఁడనని చెప్పుకొనినాఁడు:

క.

క్రిందటిదినములలోపలఁ
గందములకు సోమయాజి ఘనుఁడందురు నే
డందఱు నను ఘనుఁ డందురు
కందంబులఁ గుందవరపు కవిచౌడప్పా!

ఛందస్సంబంధ నిబంధనలయందుఁ గందరచన క్లిష్టతరమగుటచేతఁ "గందము చెప్పినవాఁడు కవి, పందిని బొడిచినవాఁడు బంటు"నను సామెత వచ్చినది. పదునెనిమిదవ శతాబ్దమునందలి కవులలో సూరనవలెఁ గందము చెప్పఁగలిగిన కవి వేరొకఁడు లేడు. తిట్టుకవిత్వమున సూరకవికంటె ఘనుఁడనని చెప్పుకొనిన పిండిప్రోలు లక్ష్మణకవి కాలక్రమము తప్పకుండ నలువురు కవులపేరు లొకకందమునఁ బొందుపఱుపఁజాలక తారుమారు చేసి పద్యము రచించుట కెంత ప్రయాసపడెనో పద్యరచనాతత్త్వజ్ఞు లీ క్రింది పద్యమువలన గ్రహింపఁగలరు.