పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

దక్కిన చాటుపద్యములును గూడ నప్రయత్నముగ నత్యాశువున క్షణకాలములో గవినోటనుండి వెలువడియుండునని శ్రవణమాత్రముచేతనే కవిత్వవేత్తలు గ్రహింపగలరు. ఆయాపద్యము లెల్ల వాని జీవిత చరిత్రాంశములను దెలిసికొనుటకు మాత్రమే మన కుపయోగపడును గాని కవిత్వతత్త్వవిచారమునకుఁ బనికిరావు. కావ్యకవితాప్రౌఢిమ చాటుకవిత్వమున కలవడుట దుష్కరము. సూరకవిచాటుకవిత్వ మంతయు నించుమించుగఁ దిట్టు కవిత్వమే. అందుచే నట్టి పద్యములయందలి భాష సామాన్య గ్రాంథికభాషగాక తఱచుగ వాడుకభాషయే యగుచున్నది.

ఆ.

మోటముండకొడుకు మాట చెల్లిననాఁడు
నన్ను లక్ష్యపెట్టినాఁడు కాడు
తెలిసి యిప్పుడు నన్ను దీవించమంటాఁడు
పడ్డ చన్ను లెత్త బ్రహ్మవశమె.

నిత్యవ్యవహారసంభాషణలయందుఁ గూడ సూరన తఱుచుగఁ బద్యములతోడనే ప్రసంగించుచుండువాఁడని వాడుక. కవి ప్రయత్నపడ నవసరము లేకయే వాని నోటఁబడిన సామాన్యవాక్యములు ఛందోబద్ధములై వెడలుచుండెను. ఒకానొక కాపుఁబడంతి తన యత్తవారియూరగు అదపాకకుఁ బోవుచు గ్రామాంతర మేగుచుండిన కవికంటఁబడినంత సూరకవి యామెను “అదపాకా? అత్తవారలౌనే పాపా!" అని