పుట:కవికర్ణరసాయనము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రుచ్చి చేతుల మేనుముచ్చుట్టురాఁజుట్టి, దొమ్మియూర్పులతావి గుమ్మరించి
తమిగోళ్లఁ దనువు జూదపుటిండ్లుగా వ్రచ్చి, చొక్కున మోవినంజుళ్లు గఱచి


గీ.

మధుమదోన్మత్తలై యల్క మఱచి సఖులు, సూరెలకుఁ దాఱఁ బతులపై సోలునట్టి
చేడియల మన్మథుఁడు వెఱ్ఱిచెఱుకువింట, నేసె నుమ్మెత్తి విరులచే నేస రేఁగి.

166


మ.

అనుకూలక్రియ చూప నేరక బలవ్యాకృష్టిచే వక్ర యై
యనుమానాకులతం బదంబు మృదుశయ్యం గూర్పఁగా లేక చా
లనిగూఢంబుగ భావముం గుకవితాలక్ష్యస్థితిం జెంది యై
న నవోఢాంగన చేసె వల్లభున కానందంబు డెండంబునన్.

167


తే.

మదనునభ్యుదయైకకర్మంబు జరపఁ, గోరుకొను కామినులుఁ గాముకులును మొదటఁ
జేసి రుదితస్మితంబులచేఁ గపోల, పాలికలయందు నంకురార్పణవిధంబు.

168


ఆ.

యువతిఁ దివియనీక యున్నపయ్యదతోన, లీలఁ దిగిచి కౌఁగిలించె విటుఁడు
తత్తఱించి వాని దర్పకుం డొరతోన, విసరి యడిద మెత్తి వ్రేయ కున్నె?

169


క.

విన దయ్యెఁ బ్రియము తుదిఁ గై, కొనదయ్యెన్ మ్రొక్కు కాముకుఁడు వెఱవక పై
కొని కౌఁగిలింప వనితకుఁ, గొనకొని కన్నీటితోన కోపము వెడలెన్.

170


తే.

మగని కౌఁగిటిబిగిచేత మగువయఱితి, హారలత ద్రెవ్వుటయు ముత్తియములు చెదరె
నటన చూప గణంగునన్నాతిచన్ను, లెదురెదుర నిచ్చుపువ్వుదోయిలియుఁ బోలెయ

171


తే.

ఉన్నతస్తనకుంభము లురము దన్ని, పట్టె నొకకేలఁ గౌఁగిటఁ జుట్టిపట్టి
యపరకరమున వీటుఁ డేమి యందఁగలఁడె? చంద్రముఖినీవితనుఁ దానె జాఱెఁ గాక.

172


క.

అంగనముఖచంద్రునకు భు, జంగముఖగ్రహణ మొప్పుసమయంబున స
ర్వాంగములకు ఘర్మోదక, సంగతిచే మజ్జనంబు సలుపఁగఁ గల్గెన్.

173


చ.

త్రివళితరంగసంగతులఁ దేలుచుఁ గ్రుంకుచు నాభిదీర్ఘకన్
వివృతకటిస్థలీపులినవీథిఁ జరించుచుఁ గౌఁగిలింప నూ
రువు లను పేరనంట్ల నడరుం బ్రియపల్లవుహస్త మప్పు డా
యువతికుచంబుల న్బొరలి యూష్మలచేతఁ దపించెఁ గావునన్.

174


ఆ.

పాక మెఱిఁగి కేలిభవనంబు వెడలెడు, సఖులతోనె వెడలి చనియె నప్పు
డేణశాబనయనహృదయంబు లజ్జయుఁ, గాముకునిమనంబుకరకరియును.

175


చ.

జనితరతిత్వరం జెలులసన్నిధిఁ బయ్యదయంటు భర్తపై
గినిసి యదల్పు మైబొమలు గీల్కొనఁ జేసి యళీకదీనతా
భినయము చూపుకాంతమదిఁ బ్రేమవిపాకముఁ దెల్సి నీవి స
య్యనఁ దనుఁ దాన జాఱె దరహాసముతోఁ జెలు లెల్ల వెల్వడన్.

176