పుట:కవికర్ణరసాయనము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తడయుట కోర్వలేక యొకతన్వి మనఃపరికల్పనంబుచే
నెడపక వల్లభుం డెదుటి కేర్పడ వచ్చినయట్ల తోఁపఁగా
నుడుగనికోర్కులం బొరలుచుండి యతం డరుదేరఁ గాంచియుం
దడియక యుండె నెప్పటి విధంబునఁ గౌఁగిటఁ జేర్చునంతకున్.

148


చ.

నెలకొనురత్నకుడ్యమున నీడయె వల్లభుఁ డంచుఁ గిన్కమైఁ
బొలఁతి పరాఙ్ముఖత్వమునఁ బొందినఁ దా నపరాధి గాన సం
కిలి వెనుకన్ వసించి పరికించువిటుండు నయత్నసిద్ధ మై
కలిగెఁ దదాభిముఖ్య మని కౌఁగిటఁ జేర్చె లతాంగి లజ్జిలన్.

149


చ.

తనహృదయం బగల్చుటకుఁ దానుఁ బతిన్ హృదయం బగల్పఁగా
వనిత తలంచెఁ గాక కడువంచన చేసినవాఁడు చేరినన్
గినుక తొఱంగి పోవఁ జనుఁ గేలఁ దెమల్చినమాత్రఁ గర్కశ
స్తనములు వీఁపున న్మొలవఁ దార్కొని కౌఁగిటఁ జేర్ప నేటికిన్?

150


ఉ.

పట్టకుఁ బట్ట కేల ననుఁ బట్టెద వోరి! బిగించి కౌఁగిటం
బట్టెదవే? వృథా యెరియఁ బట్టగు నీకయి మత్కుచద్వయీ
ఘట్టనచేఁత నిప్పు డెఱుఁగం దలపోయవు గాక యెవ్వతెం
బెట్టినవాఁడవో హృదయపీఠిక దానికి నొత్తు డౌఁ జుమీ!

151


క.

తద్రదనఖాదిముద్రా, ముద్రితు నినుఁ దగవు మాలి ముట్టుదునట్రా?
యుద్రేకింపక తల శఠ!, ముద్రించినసొమ్ము పరులు ముట్టం దగునే?

152


క.

తలఁ పెత్తి యొండుపేరం, బిలిచినఁ దప్పేమి? నీకుఁ బ్రియ మగుసతిగాఁ
దలఁచుట చాలదె? నాక, ప్పొలతుఁకనామంబుఁ దాల్చుపుణ్యము గలదే?

153


క.

ద్రోహముసేయమికి పరా, రోహ మది న్నమ్ము నీదురోమావళికృ
ష్ణాహిం బట్టుదు నిదె యని, సాహసికవిటుండు నీవిసడలం దొడికెన్.

154


చ.

ఘనకుచకుంభయుగ్మ మిది గైకొన నీక వియోగవార్ధిలో
నను మునిఁగించుభావమున నాజలజాయతనేషేత్ర! శయ్యపై
ననయము నల్కమై నకట! యవ్వలిమోమయి? తైన నేమి నీ
వినుతకటీతటీపులినవీథి వసింపఁగ గల్గెఁ జాలదే!

155


క.

మన్నించి యిట్లు నన్నుం, దన్నియశోకుఁడుగఁ జేయుతలఁ పిది యొప్పున్
నన్ను దయఁ జూచి యిఁక నో, కన్నియ! వెసఁ దిలకితాత్ముఁ గా జేయఁ గదే.

156


క.

ఈరీతిఁ గుటిలవాక్య, ప్రారంభవిజృంభణంబు ఫలముగ నలుకల్
దేరుటయుఁ గలసి చూపిరి, పౌరవిటీవిటులు సీధుపానక్రీడల్.

157