పుట:కవికర్ణరసాయనము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కరఁగెడుచంద్రకాంతములఁ గాలువ లై ప్రవహించునీటనో?
విరియునవోత్పలావళుల వెల్లువ లై చనుపువ్వుఁదేనెనో?
తొరఁగువియోగిబాష్పములతోరపుటేఱులచే సమృద్ధినో?
పొరిఁబొరి నింగి మింగుచును బొంగెఁ బయోధి విధూదయంబునన్.

139


ఉ.

పిల్లల కెల్ల మేపి మును పేర్చిన వెన్నెలతీఁగెలేఁగొనల్
కొల్లఁగఁ దారునుం బతులుఁ గుత్తుకబంటిగ మేసి గూండ్లలో
వెల్లులు గూడఁ బోసికొనువేడుకఁ బుక్కిటఁ బట్టి చీఁకటుల్
జల్లునఁ బాఱఁగా నుమియుఁ జాఁగినకోరిక లంజకోరికల్.

140


వ.

అప్పుడు.

141

యువతీశృంగారకేళివర్ణనము

క.

ఇతరశరంబులు గాఁ డని, యతివలయభిమానకవచ మతనుఁడు సించన్
సితకరశాణసముత్తే, జితకువలయసాయకములచే నట్టియెడన్.

142


తే.

తప్పు లొనరింప కైన నాతప్పు లెన్ని, తారు మును ద్రోచిపుచ్చుటే త ప్పటంచుఁ
బ్రియుల దోతేర సఖుల నంపిరి వనితలు, తప్పు తమ దని ప్రణయంబు చెప్ప నేల?

143


ఉ.

త్రోచినమీఁదటన్ మరలఁ దోకొని వచ్చుట కెన్నిభంగుల
న్నేచినదాన వీ నయిన నిన్నిటు వంపఁగఁ జాల నిక్కువం
బోచెలి! నీవ నే నగుచు నుండుటఁ బోయిననిన్ను నన్నకాఁ
జూచి యతండు లాఘవము చూపెడునో యని యేమి సేయుదున్?

144


ఉ.

ద్రోహములేనిచోట విభుఁ ద్రోచినద్రోహఫలంబు గాదె న
న్నీహరిణాంకుఁ డింత యెరియించుట? వెన్నెల కోర్చునంతనే
సాహసి నెట్లు? నాయెడఁ బ్రసన్నకృపామతి వై లఘుత్వసం
దేహము లేక వల్లభునిఁ దెచ్చువిదగ్ధవు నీవు నెచ్చెలీ!

145


చ.

ఎడయెడమాట లేల? చని యేన ముఖాముఖిఁ బిల్తుఁ బిల్వఁ గాఁ
నొడఁబడి రాఁడ యే నతని కొప్పనసేయుదుఁ బ్రాణ మన్న నీ
నడుమన నన్ను జీవము గొనం దలకొన్నది యోవయస్య! యీ
విడువనివేలమై కురియువెన్నెలచిచ్చున కేమి సేయుదున్?

146


తే.

అనుచుఁ బ్రియదూతికలతోడ నాడికొనఁగఁ, బలుకు లవి చాటువడి వించుఁ బతులు లోని
తుకతుకలు మాని క్రొత్తవేడుకలు వొదల, బయలువడి వల్లభల సిగ్గుపఱిచి రపుడు.

147