పుట:కవికర్ణరసాయనము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జందురుఁ డంగరాగరుచి జారఁ గవుంగిటఁ జేర్చి పొందె స్వ
చ్ఛందతఁ దారకాకుసుమసంకుచితాంబరతల్పమధ్యమున్.

129


తే.

ఇంచుకించుక శశి యుదయించునపుడు, తఱుచుఁజీఁకట్లు భీతిమైఁ దఱిసి దాఁగె
ముకుళితాంబుజపుటకుటీమూలములనొ?, సభయమూర్ఛితవిరహిణీస్వాంతములనొ?

130


చ.

సుదతులనున్న గ్రొవ్వెదలు చొచ్చెనొ? కాంతలరోమరేఖలం
దొదిఁగెనొ? పుష్పకోమలులయోలపునాభుల లీన మయ్యెనో?
ముదితలచూడ్కిఁ జేరె నొకొ? ముగ్ధలఱెప్పలలోన డాఁగెనో?
వెదకిన లేకపోయె నభివృద్ధతమంబు విధూదయంబునన్.

131


క.

ప్రమథపతిమూర్తిచంద్రుఁడు, తిమిరగజాసురు వధించి తిత్తొలిచినత
త్సమధికచర్మముఁ దాల్చిన, క్రమమున సంకంబు కడుఁబ్రకాశిత మయ్యెన్.

132


చ.

కరమిళనంబుచే ముఖవికాసము గల్గగఁ జేసి వెల్వడన్
దెరు వఱి చిక్కి యున్న యలతేంట్లను లోపలికందు నాపివి
స్ఫురితపరాగహాసపరిపూరితఁ జేసి మధుచ్ఛలంబునన్
గరఁగఁగఁ జేసి మానసము కైరవిణీప్రియఁ జంద్రుఁ డయ్యెడన్.

133


చ.

అనుపమకాలచక్రఘటయంత్రవశంబునఁ జంద్రమండలం
బనుపటికంపుగుండ్రఁ గలయంబడ నొల్కుచు సాంద్రచంద్రికాం
బునిధిసముద్ధతామృతము ముంచె జగం బనుపేరిసస్యము
న్దినకరతీవ్రతాపనిహతిం గలవా డఱి తొంగలింపఁగన్.

134


సీ.

పైసుధారోచిబింబము తక్రమునయందు, మునిఁగి తేలెడువెన్నముద్ద గాఁగ
మహి విశ్రమించుదంపతులు పాల్కడలిలో, భాసిల్లుదివ్యదంపతులు గాఁగ
నింగినాడుచకోరనివహంబు మిన్నేటఁ, గలయ నీఁదెడునంచకొలము గాఁగ
దెసలఁ గైరవసముత్థితపరాగము వజ్ర, మయశైలతటులపై మంచు గాఁగ


గీ.

మీఁదఁ దొట్టి క్రింద మిక్కుటం బై యంత, రాళ మెల్ల నిబ్బరముగ ముంచి
యెల్లకడలయందు మొల్ల మై పండువె, న్నెల జగంబుకుక్షి నిండి వెలిఁగె.

135


క.

కడలేనియచ్చవెన్నెల, నడుమం జంద్రుండు మంథనగమునఁ దరువం
బడు పాలకడలి మును దాఁ, బొడమి పయిందేలువిధముఁ బొందుగఁ దెలిపెన్.

136


ఆ.

పాలకుండవోలె బ్రహ్మాండ మప్పుడు, జీర్ణచంద్రికాభిపూర్ణ మగుచుఁ
బాలు గ్రోల మీఁదఁ బైకొన్న ఫణిఫణా, బింబ మనఁగ నిందుబింబ మలరె.

137


తే.

మించి వెన్నెల జగ మెల్ల ముంచినపుడు, తఱచుఁజీఁకట్టు భీతిమైఁ దఱిసి డాఁగె
ముకుళితాంబుజపుటకుటీమూలములనొ?, సభయమూర్ఛితవిరహిణీస్వాంతములనొ.

138