పుట:కవికర్ణరసాయనము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ప్రాంతనీపవనీస్థితవ్యాఘ్రదనుజుఁ, గూల్చి భగవంతుఁ డమరులు గొలువ నచటి
కరుగుదేరఁ బ్రణామార్చనాభినుతులఁ, బ్రీతుఁ గావించి వరము గోరితిమి నేము.

56


గీ.

అహరహంబు నిచట నర్చనాదులచేత, నీను భజింపవలయు నిత్యసన్ని
ధాన మిచట మాకు దయ సేయు మనిన ద, యార్ద్రుఁ డగుచు నిట్టు లానతిచ్చె.

57


మ.

హరిదశ్వాన్వయమందు దాశరథినై యస్మత్పదాంభోజత
త్పరుఁ డై యుండువిభీషణాఖ్యునకు మద్ధామంబు శ్రీరంగమే
కరుణాధీనత నీ నతండు గొని రాఁ గావేరిలోఁ జంద్రపు
ష్కరిణీతీరమునందుఁ గైకొనియెదం గల్పావధిస్థైర్యమున్.

58


గీ.

రంగదివ్యవిమానగర్భమున శేష, శయనశయు నన్ భజింపుఁడు సంతతంబు
నని యెఱింగించి చన నేము నసురమథనుఁ, గొలిచి యేగితి మర్కమండలముదనుక.

59


క.

చని క్రమ్మఱియెడుమముఁ గనుఁ, గోని మీకులకంద మైనకోకనదాప్తుం
డనియె మునులార! యిందఱు, వినుఁ డే నెఱిఁగింతుఁ బూర్వవృత్తాంతంబున్.

60


సీ.

బ్రహ్మలోకమున శ్రీరంగేశు నే నుపాసించి వేఁడితిని నాచేతియట్ల
మద్వంశభవు లైనమనుజనాయకులచే, నర్చితుండుగ విభుఁ డట్ల యియ్యఁ
గొని వచ్చి యిక్ష్వాకుకులులచే నిన్నా ళ్ల, యోధ్యయందు సపర్య నొందె నింక
నస్మత్కులీనుల యని ధర్మవర్మాదు, లగుచోళనృపులచే నర్చితుఁడుగఁ


గీ.

బోవుఁ గావేరిలోఁ జంద్రపుష్కరిణికిఁ, గానఁ జనునది మోక్షార్థు లైనజనము
లచట శ్రీరంగపతిఁ గొల్వ ననిన వచ్చి, నాఁటనుండియు నేము నున్నార మిచట.

61


చ.

దశరథరాముఁ డై పొడమె దైత్యవిభేదియు రంగధామమున్
దశవదనానుజుం డటకుఁ దథ్యమ కా కొని వచ్చి వచ్చినన్
భృశముగ నీకు మేము వినుపించినదాఁకఁ దపంబుచే వృథా
కృశుఁడవు గాక నెమ్మది సుఖింపు మహీపరిపాలకుండ వై.

62


వ.

అని యాదేశించినం బ్రహృష్టహృదయుండై ధర్మవర్మయుం గ్రమ్మఱి తదుపాంతకా
వేరీదక్షిణతీరస్థితం బైననిచుళానామనిజపురంబునకుం జని రంగధామసమాగమప్రతీ
క్షాపరుం డై రాజ్యంబు సేయుచుండఁ గొండొకకాలంబున.

63


ఉ.

రావణుఁ గూల్చి వచ్చి రఘురాముఁడు దా హయమేధదీక్షితుం
డై వసుధేశులం బిలువ నంపినఁ దాను నయోధ్య కేగి చో
ళావనిభర్త రాజసభయందు విభీషణుఁ గాంచి సమ్మదం
బావహిల న్మఖాంతమున నర్చితుఁ డై చనుదెంచెఁ గ్రమ్మఱన్.

64


క.

వచ్చి విభీషణుఁ డిదిగో, తెచ్చున్ శ్రీరంగధామదివ్యవిమానం
బిచ్చటి కనునిశ్చయమున, హెచ్చినహర్షమునఁ గృతసమీహితబుద్ధిన్.

65