పుట:కవికర్ణరసాయనము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

రాక్షసేశ్వరుం డైనవిభీషణు నాతిథ్యంబున నఖిలలోకేశ్వరుం డైన శ్రీరంగపతిసమర్చ
నంబునకుం దగినట్లుగా నుచితవివిధప్రశస్తవస్తూపకరణసామగ్రీసంపత్సంపాతనంబు
చేసికొని విభీషణాగమనంబునకు నెదురెదురుచూచుచుండు నంత.

66


సీ.

అట నయోధ్యాపురియందు శ్రీరఘురాముఁ, డాత్మోపకర్తయు నతిహితుండు
నగు విభీషణు లంక కనుపునప్పు డనుగ్ర, హాతిరేకమున నిజాన్వయైక
జీవధనం బైన శ్రీరంగధామంబు, సపరిచ్ఛదంబును సపరిజనము
గా నొసంగుటయు నాదానవాధిపుఁడు కృ, తార్థుఁ డై ధరణి సాష్టాంగ మెఱఁగి


తే.

మస్తకంబున ధరియించి మంత్రివరులుఁ దా నభోవీథి లంకకు దక్షిణాభి
ముఖముగాఁ గడు ముదమున మోచి తెచ్చు, వేళనడుమన మధ్యాహ్నకాల మైన.

67


గీ.

తత్సమయపూజనము సేయఁ దలఁపు వొడమి, మహికి డిగ్గి మరుద్వృతామధ్యమహిత
చంద్రపుష్కరిణీసరస్తటమునందు, దనుజపతి నిల్పె శ్రీరంగధామ మపుడు.

68


మ.

కని యచ్చో మును లద్భుతప్రమదమగ్నస్వాంతు లై చోళభూ
జనభర్త న్వినుపింప వచ్చి సలిపెన్ సంప్రీతి నాతిథ్యమున్
దనుజేంద్రుండును రంగధామునకు నుక్తప్రక్రియం జేసె న
మ్మనుజాధీశ కృతోపచారములచే మధ్యాహ్నకాలార్చనల్.

69


గీ.

తాను మునులును శ్రీరంగధాముఁ గాంచి, చిరమనోరథసిద్ధికిఁ జిత్త మలరఁ
జోళభూభర్త యొకకొంతకాల మిచట, దనుజపర! నిల్పు మని వేఁడుకొన నతండు.

70


ఉ.

నైకటికంబు ఫాల్గునమున న్నరనాయక! రంగభర్త కి
క్ష్వాకుకృతోత్సవం బగుటఁ జయ్యన లంకకుఁ బోవు టొప్పు నా
నీ కిది లంక గాదె శుభనిష్ఠఁ దదుత్సవలక్ష్మి నిచ్చటం
జేకొని రంగభర్తఁ గృప సేయు కృతార్థత మాకు నీదయన్.

71


క.

అని వేఁడి యమ్మహాత్ముని, యనుమతిఁ గొని హృష్టహృదయుఁ డై చిరకాలో
పనతనిజయత్నఫలముగ, నొనరించెం దన్మహోత్సవోపక్రియలన్.

72


సీ.

నవ్యనైకసమగ్రదివ్యభోగములచే, రాగమగ్నుం డయ్యె రంగభర్త
సవినయపరవస్తుసత్కారములచేతఁ, బ్రీతాత్ముఁ డయ్యె విభీషణుండు
అర్ఘ్యపాద్యప్రభృత్యర్హార్పణములచేఁ, బ్రముదితం బయ్యెఁ దపస్వికులము
మృష్టాన్నసత్రాద్యభీష్టదానములచే, సంతుష్టిఁ బొందిరి సకలజనులు


తే.

నవబృధము సేయ జగము కృతార్థమయ్యెఁ, బూతమతి ఫాల్గునంబునం బుబ్బతొడఁగి
ధర్మవరాఖ్యుఁ డగుచోళధరణీధవుఁడు, తగ నొనర్చు నవాహ్నికోత్సవము నపుడు.

73


క.

ఈగతిఁ బ్రతిదిననవనవ, భోగమునఁ బదేనునాళ్లు వోవఁ బ్రయాణో
ద్యోగమున నృపుని నిలిపి మ, నోగతిఁ బోలుచు విభీషణుఁడు గృతనతియై.

74