పుట:కవికర్ణరసాయనము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యలరుల నిచ్చెదే యనుచు నల్లె సపత్నియు నట్ల కాదె ధూ
ర్తులు తుద నెల్లవారలకు దూరుల పో తలపోసి చూచినన్.

27


చ.

తనుఁ బెరపేరఁ బిల్చి యిడఁ దత్కుసుమంబుల పూఁచి మోమునన్
గినుపున వ్రేసె నొక్కసతి కేసరరేణువు రాలె నంచుఁ జేఁ
గనుఁగన మూసికొన్న వెఱఁ గౌఁగిటఁ జేర్చుచుఁ గేలు వుచ్చి చూ
చిన నగుధూర్తపల్లవునిచేఁతకు గాసిలి యల్లెఁ గ్రమ్మఱన్.

28


ఉ.

నేరవు నీవు కొప్పిడఁగ నే ఘటియించెదఁ బువ్వు లంచు నం
భోరుహలోచనన్ దిగిచి ముందర నుండఁగఁ బంచి యొక్కరుం
డీరస మొందుతోడిపతి కివ్వలమోము మలంచి చుంబనా
చారముచే మనఃప్రియము సల్పె సఖుల్ తననేర్పు మెచ్చఁగన్.

29


చ.

సవతిమొగంబు చూచుచు నొసంగినపల్లవుమీఁదికిన్సునన్
దవిలిననెవ్వఁగం దనువు తప్తముగాఁ దలవంచి యున్నయ
య్యువతికరంబులోనివిరు లూష్మతఁ గందుట చెప్ప నేటికిన్?
గవిగొను దానియూర్పులసెకన్ గసుగందె వనంబుపువ్వులున్.

30


చ.

చిగురులఁ గర్ణపూరములు సేయుతలంపునఁ గోయునంతలోఁ
దగ వఱి యవ్వలన్ విటుఁడు తాను సపత్నియుఁ గూడుకొన్న నె
వ్వగ నొకపువ్వుఁబోఁడి వలవంతల వేఁగుచుఁ జేత నున్నయా
యిగురులె సెజ్జ చేసికొనియెం దనుతాపభరోపశాంతికిన్.

31


చ.

తలిరుల నెల్లఁ గోసి కరతామరసద్యుతి వెల్లి గొల్పఁగా
నలరుల నెల్లఁ గోసి నఖరాంచలదీప్తులు పై నిగుడ్పఁ గాఁ
జిలుకల నెల్లఁ దోలి తమచిన్నియెలుంగులభంగిఁ జూపఁగాఁ
జెలువము క్రొత్త యై సతులచే వనవాటిక యొప్పె నయ్యెడన్.

32


తే.

తమయలంకారములకు నై తరుణు లెల్లఁ, గ్రొవ్విరులుఁ జిగుళ్లును గోసి రైన
దాన వనవాటికకుఁ బొల్బు తఱుఁగ దయ్యె, దార యయ్యింతు లొకయలంకార మగుట.

33


చ.

అనుఁగువిటుల్ ప్రసూనముల నాభరణంబులు గూర్ప నేర్పుమై
ననువు లెఱింగి మేనికళ లారసి మర్మము లంటువేళలన్
దనువులఁ బుట్టుచిత్తడుల దట్టము లై దిగజాఱెఁ గాంతలం
దనయము రేఖ లై వనవిహారపరిశ్రమఘర్మతోయముల్.

34


చ.

పొలఁతులకున్ వనీవిహృతిఁ బుట్టినసేదలు దొల్కరించినన్
వలిచనుఁగొండలం బొడమి వచ్చుపరిశ్రమవారివాహినీ
విలసనరేఖకున్ వళులు వీచిపరంపర లయ్యె నిమ్ననా
భులు తిరు లయ్యె వాలుకలపుంజము లయ్యె నితంబబింబముల్.

35