పుట:కవికర్ణరసాయనము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పూచినపువ్వు లెల్ల నుతిఁ బొందె మనోభవునంపకోల లై
వీచినగాడ్పు లెల్లఁ బొదలె న్మలయాచలమారుతంబు లై
యేచినపల్కు లెల్లఁ దగియెన్ బికభృంగశుకస్వరంబు లై
చూచినరూప మెల్ల మదచుంబిత మై విలసిల్లె నామనిన్.

14


చ.

ప్రసవశరప్రతాపశిఖిఁ బర్వఁగఁ జేయుటచే నిదాఘ మై
కుసుమరసాతివర్షమునకున్ గుదు రౌటఁ బయోదకాల మై
రసికమనోంబుజంబు లలరంగ శర త్తయి తాన శైశిరో
ల్లసనముఁ జూపి పాంథసతులన్ వణంకించె వసంత మత్తఱిన్.

15

మాంధాత యువతులఁ గూడి వనవిహారము సల్పుట

వ.

ఇట్టివసంతసమయంబున మహీరమణశేఖరుం డొక్కనాఁడు విహారకుతూహలంబునం
బ్రేయసీసమేతుం డై గణికాగణంబులు విటవిదూషకాదిక్రీడాపరికరజనంబులు
నర్హవాహనారూఢు లై కొల్చి రా విరచితోచితవివిధవిచిత్రక్రీడాలతాగృహాలంకృ
తాంతరంబునుం గేలీశైలశైవలినీప్రముఖనానావిహారప్రదేశోపశోభితంబును వసంత
విలసితస్వవిలాసాపహసితనందనంబును నగునగరోపవనంబు సొత్తెంచె నప్పుడు.

16


ఉ.

ఇంచుగతిం బరాగ మెగయించియు వెంటన వచ్చుతేంట్ల మ్రోఁ
గించియుఁ గమ్మతావు లొలయించియుఁ బైమకరందబిందువుల్
నించియు మెచ్చి తన్ బొగడు నేర్పు లొసంగుచు నెల్లవారికిన్
బంచవిధేంద్రియంబులకుఁ బండువు చేసె వనీసమీరముల్.

17


వ.

ఇ ట్లభిమతప్రమదవనసమీరంబు లెదురుకొనం గ్రీడావనమధ్యంబు తఱిసి వివిధమధుర
తరులతావిశేషంబులం గలుగునభినవకుసుమకిసలయఫలపరాగమకరందమిళిందశుకపిక
మిథునసంపదల నుత్కర్షించుచుం గలయ మెలంగి పుష్పాపచయముKsచ్ఛావిహారం
బులకు నందఱ నద్దినం బెల్ల నచట నిలువ నియమించి పాలికాదిసఖీజనంబులు గొలువ
విమలాంగియుం దానును వసంతునింటికి విందువచ్చురతీసహాయుం డైనమన్మథుండు
నుంబోలె నొక్కయభ్యంతరవనాంతరంబు చొచ్చి యందు.

18


సీ.

నవలీల మలయగంధవహుండు వివిధపు, ష్పామోదముల నుపాయన మొసంగఁ
గలకుహూరుతములఁ గలకంఠములు సవి, నయభంగి విజ్ఞాపనంబు చూపఁ
బరిపక్వఫలరసప్రణతిమైఁ దరువులు, కిసలయాంజలిపుటీక్రియ ఘటింపఁ
గలితప్రసూనసంగతి వల్లికలు తల్ప, రచనామహోపచారము నొనర్ప


గీ.

లలనతో రాజు వనవీథికల సుఖించె, మంజరీపుంజనిష్యందమానమధుర
మధురసాస్వాదసమ్మోదమధుపగీతి, మాధురీధుర్యమాధవీమండపముల.

19