పుట:కవికర్ణరసాయనము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పొన్నలు నవ్వెఁ గ్రొన్ననలపుష్పరసంబునఁ గేసరంబు లు
త్పన్నజుగుప్స మై నుమిసెఁ బాటలము ల్గుసుమోదయంబుచేఁ
గన్నెఱ చేసెఁ దిట్టెఁ గలకంఠరుతంబులఁ జూతము ల్వృథా
మున్నుగ నన్నిటం గడచి మోదుగుపువ్వుల విఱ్ఱవీఁగినన్.

7


చ.

చిగురులచేతఁ గోయిలలఁ జిత్రఫలంబులజేతఁ జిల్కలం
దగుపువుఁదేనెచే నలులఁ దావులచే మలయానిలంబులన్
మొగడలచేఁ బ్రసూనశరు మోదితుఁ జేసి యభీష్టదంబు లై
పొగడిత కెక్కెఁ గల్పకముఁ బోలె రసాలకుజంబు లామనిన్.

8


సీ.

వివిధవనీరమావిమలసాంద్రకటాక్ష, వీక్షాపరంపరావిలసనములు
మలయమారుతచరన్మత్తేభచరణావ, లంబితాయతశృంఖలాలతికలు
పథికజనావలీప్రతిసమాకర్షణ, ప్రద్యుమ్నముక్తదోఃస్రగ్రహములు
మధుజగన్మోహనమంత్రవాదికరాబ్జ, వలమాననలినాక్షవలయితములు


గీ.

ప్రథమకౌమారనవపరిపాకకలన, వికసదభిమతతరులతాగ్రకరమంజు
మంజరీమధుమధురిమోన్మాద మెసఁగ, మెలఁగె బహువిధగతులఁ దుమ్మెదలగములు.

9


చ.

పనివడి హారదంతురితపాండ్యవధూకుచశైలసంధులన్
ఘనముగ డస్సి చోళనవకంజముఖీరతిఘర్మవారి నా
ని నెఱిని గుంతలీసురభినిశ్వసనంబుల నూఁత గొంచు నొ
య్యనఁ జనుదెంచె నంత మలయాచలశీతలవాతపోతముల్.

10


క.

మమ్మురపుందేనెలజడి, చెమ్మ లపనవీథు లెల్లఁ జెన్నగుటఁ జుమీ!
కమ్మవిరితావిమోపరి, తెమ్మెర లొయ్యొయ్య వెఱచి తిరుగుట లెల్లన్.

11


చ.

చలువలపుట్టినిండ్లు నవసౌరభలక్ష్ముల కంతరంగముల్
మెలఁపులకు న్నివాసములు మెచ్చులచేరుగడల్ విరక్తతా
కలవల కెత్తుకోళ్లు తమకంబులకుం గయిదండ లామనిన్
మలయుచు వచ్చె గంధగిరిమంధరబంధురగంధవాహముల్.

12


సీ.

రేల వెన్నెలలు పండ్రెండుసూర్యులు చూపు, బీఱెండ లై కాసి నీరసింప
దక్షిణానిలము లుద్ధతి నేడుదెఱఁగులఁ, బెరిగెడుగాడ్సు లై పెల్లగింపఁ
గెంజాయ దిక్కులఁ బింజించుచిగురులు, కాలానలార్చు లై కాఁకఁ బెనుప
నలి శుకపికగర్జ లడరఁ బూదేనియ, ఘోరాంత్యవృష్టి యై కురిసి కలఁప


గీ.

విరహవేదన లెసఁగి యుద్వేలగతుల, నద్భుతముగ నేకార్ణవ మగుచు ముంప
నఖిలసుఖకారి యగువసంతాగమంబు, పథికలోకంబునకు మహాప్రళయ మయ్యె.