పుట:కవికర్ణరసాయనము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాపారంబుల దినశేషంబు గడపి నిశోదయంబునఁ గృతకరణీయుం డగుచు నవో
ఢారిరంసామాంసలం బైనచిత్తంబున.

197

విమలాంగీమాంధాతలు క్రీడాగృహము సొచ్చుట

సీ.

రతిబంధబంధురప్రతిమావితనంబు, కల్పితకల్హారకల్పకంబు
సురభితైలోదయచ్ఛురితప్రదీపంబు, కర్పూరధూపసమర్పణంబు
శుక్తివిన్యస్తకస్తూరీపటీరంబు, వీటికాపరిపూర్ణపేటికంబు
శయ్యాసమీపకాంచనకళాచీకంబు, గంధవద్వారిభృంగారుకంబు


గీ.

భర్మపంజరశుకశుకీపఠ్యమాన, కామశాస్త్రోక్తబహుపద్యగద్యకంబు
కరణనికరసమున్మాదకారణంబు, మనుజపతి సొచ్చె మోహనమందిరంబు.

198


వ.

చొచ్చి క్రీడాగృహమధ్యంబున సమున్నతరత్నపీఠంబు నలంకరించి యుచితపరిచారి
కలు సేవింప నుండునంత నట మున్న పాలికాదిప్రౌఢసఖీజనంబు విమలాంగిం జేర
నరిగి.

199


తే.

గాజుపూసకుఁ గనకనిష్కములు వ్యయము, సేఁత తక్కినపనులు గైసేఁత సతికి
జాతిమణి గొనఁ గనకనిష్కములు వ్యయము, సేఁత వరుగూర్చుపనికిఁ గైసేఁత సతికి.

200


వ.

అట్లగుట నీకు నిప్పుడు సఫలం బైనశృంగారం బంగీకరింపవలయు రమ్మని ప్రారంభ
ప్రయోజనంబు దేటపడం బలికి ప్రహర్షజనితముఖవిలాసాలంకృత యగునచ్చెలువకుఁ
బునరుక్తంబుగా సమయసముచితాలంకరణం బొనరించి తోతేర లజ్జాప్రవాహంబు
నకు నెదురేగుట గా నెట్టకేనియుం గేళీమందిరంబునకు వచ్చునప్పుడు.

201


తే.

నిబిడవీచీపరంపరానీత యగుచుఁ, గొలనిదరిఁ జేరుజలరుహంబులపరాగ
రేఖయునుబోలెఁ బ్రియసఖీ, ప్రేరణమున, నొయ్యనొయ్యన సతి కేళిశయ్యఁ జేరె.

202


తే.

తల్పమునకు సఖీప్రయత్నమున వచ్చు, నభినవోఢకు నడుగడు గామ డయ్యె
దలఁపు పురపురగొనఁ దత్తఱిలుతదీయ, కాంతునకుఁ దత్క్షణము బ్రహ్మకల్ప మయ్యె.

203


క.

మరుఁడును లజ్జయు డెందము, సరిపాలం బంచికొనఁగ సాధ్వసమునఁ ద
త్పరిశిష్టాంశము గొనియే, వరతల్పమునకు నవోఢ వచ్చెఁ గడంకన్.

204


వ.

ఇ ట్లరుగుదెంచి ప్రాంతరత్నస్తంభంబు దాపుగొని సఖీజనంబులమరువున లజ్జావనత
వచనారవింద యగుసుందరిం గడచి ముందఱికి వచ్చి తనకు మ్రొక్కినపాలికం
జూచి నృపాలతిలకుం డాఁగినమనఃప్రమోదంబు మొగంబున దరహాసంబు మొలపింప
ని ట్లనియె.

205


ఉ.

పాలిక! యేమివార్త? ధరపై ధర కేమిటివార్త? దేవ! నీ
వేలఁగ నొవ్వగోరుకొను దీ వనుభీతియె దక్క మానెఁ గా
కేల భయంబు? సేయుపని యెవ్వరు మాను మనంగఁ గర్త? లీ
వేలిక వొంట రెంట నయ మిమ్మని కా కిటు విన్నవించుటల్.

206