పుట:కవికర్ణరసాయనము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

హోమవేదియందు నొక్కపీఠంబున, నొప్పి రపుడు కన్నెయును వరుండు
గంతుఁ డిరువురందుఁ గలకూర్ము లొక్కింత, చూచి కట్లె వైచి తూఁచుకొనఁగ.

193


వ.

ఇట్లు వివాహంబు నిర్వర్తించి క్రమంబున దినచతుష్టయం బరిగినం బంచమవాసరం
బునఁ బ్రభాతం బగునంతఁ గుంతలేశ్వరుండు పరిణయాగతరాజసమాజంబుఁ బూజించి
శుభముహూర్తంబున వధూవరులం బయనంబు చేసి.

194


రగడ.

పగడపుదీఁగెలు గోమేధికములు, పచ్చలుఁ గెంపులు పుష్యరాగములు
నిగనిగ మనువైడూర్యములును హరి, నీలము లంభోరుహరాగములు
ముక్తాఫలములు వజ్రోపలములు, మొదలగురవమణిసందోహంబులు
శుక్తిపాలికలు శంఖపుటంబులు, శుద్ధసువర్ణాదికలోహంబులు
వెలిపట్టులు మంజిడులును దోఁపులు, వెల్లులుఁ జెంగావులు సకలాతులు
వలిపంబులు దుప్పట్లును మాదా, వళులును జీబులు జిలిబిలిజాతులు
గింటెంబులు బతినీల్ దసలీలును, గిముకాకరకులు సుకదట్టమ్ములు
కంటకిగుజ్జరీమదుపువులు మొదలుగఁ, గలిగినపలువన్నెలపుట్టమ్ములు
కుంకుమపు వ్వగరును దట్టపునుం, గును గస్తూరియు హిమవారిపూరము
సంకుమదంబు గుమంజియుఁ బూతియుఁ, జందనఖండంబులుఁ గర్పూరముఁ
దెల్లనిజల్లులు వింజామరములుఁ, దెగగలసవరా లేనికకొమ్ములుఁ
జల్లనిగందపుఁజిప్పలు రత్నపు, సానలు శశికాంతము నద్దమ్ములుఁ
బగడపుబరణులు దంతపుఁబెట్టెలుఁ, బలువన్నెలచిలుకలయడకొత్తులు
జిగలపగడపుగిండ్లును గిన్నెలుఁ, జిత్రము లగుధూపంబులవత్తులు
జాలవల్లికలు పలుమానికములు, చదరంగంబులు సొగటాసారెలు
కాళాంజులు మసగపుఁబ్రతిమలు మేల్, కట్టులు నేకాండపుఁదెరచీరెలు
సరసపుఁబలుకులు గద్యపద్యములు, చదువఁగ నేర్చినశుకశారికలును
నిరతము నాడఁగఁ బాడఁగ నేర్చిన, నెచ్చెలి నెఱజాణకుమారికలును.

195


క.

మున్నగువస్తువు లరణము, కన్నియ కిడి వెంట మూఁడుగమనము లరుగన్
మన్నించి నిలిపి వీడ్కొని, యున్నతముగఁ బతియుఁ గూర్మియువిదయుఁ దానున్.

196

మాంధాత పత్నీసహితుఁ డై యయోధ్యకుఁ జేరుట

వ.

సైన్యసమేతుం డై కతిపయప్రయాణంబుల నయోధ్యాపట్టణంబు గదియం జని నిజ
సామంతపౌరివర్గంబు లెదుర్కొన మహోత్సవాలంకృతంబైనపురంబు ప్రవేశించి
సఫలమనోరథుం డై మఱునాఁడు వివాహసమాహూతు లై వచ్చి యున్న సకలరాజ
లోకంబు నుచితసత్కారంబులం బ్రీతులం గావించి నిజదేశంబుల కనిపి యుచిత