పుట:కవికర్ణరసాయనము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

బాలికామణిశృంగారభంగు బెల్ల, విశ్వవిజయైకదీక్షాప్రవృత్తుఁ డైన
తనకు సమరోక్తసన్నాహదశలు గాఁగ, దర్సితుం డయ్యె మిగులఁ గందర్పుఁ డపుడు.

173


వ.

అంతట మహీరమణచంద్రుండునుం బారిజాతమహీజాతంబు వసంతవిలాసంబునుం
బోలెఁ బరిణయోచితాలంకరణంబుఁ బూని పంకజహితుం డపరజలధిం గ్రుంకినం గర
ణీయంబులు నివర్తించి మౌహూర్తికదత్తం బైన సుముహూర్తంబు నికటంబు విచ్చే
యు మని భావుకవిజ్ఞాపితుం డై.

174


సీ.

మూర్ధాభిషిక్తులముకుటరత్నద్యుతు, ల్కరదీపదీప్తులఁ గలిసికొనఁగ
రత్నవేత్రపరంపరారుచు ల్పురసతీ, నీరాజనాంశుల నిలిపికొనఁగ
స్మేరముఖాంబుజశ్రీ పార్శ్వదోధూయ, మానచామరలక్ష్మి మాఱుకొనఁగ
వందిమాగధులకైవారంబురావంబు, శుభతూర్యరవములఁ జూఱకొనఁగఁ


గీ.

బసిఁడిరథ మెక్కి విపులవైభవము మెఱయఁ, జూపరుల కెల్ల వ్రేఁకపుఁజోద్య మొదవ
సాంగమై వచ్చుభాగధేయంబుఁ బోలె, మామయింటికి వచ్చె జామాత యపుడు.

175


వ.

ఇ ట్లరుగుదెంచి రథావతరణం బొనరించి యెడనెడఁ బ్రాయంపుఁబడంతులు తమ
మెఱుంగుఁజూపులతోడి కర్పూరదీపకళికల నిగిడింప మంగళాలంకారసంకులంబు లగు
కక్ష్యాంతరంబులు గడచి చనినయనంతరంబ యభ్యంతరంబున.

176

విమలాంగీమాంధాతృ వివాహము

చ.

కదళము లూరుకాండములు గాఁగఁ దలంపుచుఁ బూర్ణకుంభసం
పదఁ గుచకుంభభావనయ పైకొన దర్పణలక్ష్మిచే హస
ద్వదనము చూచినట్లయి ప్రవాళరుచిం జిగిమేనుఁ దోఁపఁ గా
నెదుటనె యున్నకన్నెసవియే పతి చూచె వివాహవేదికన్.

177


వ.

ఇట్లు కన్యావిలోకనమనోరథంబు తమకంబు రేఁపం గళ్యాణరంగంబు గదియఁ జను
దెంచి యచట సర్పితమహార్హమణిమయోన్నతపీఠాసనంబున నాసీనుం డై వివ్వదుపదిష్ట
మార్గంబునం గుంతలేంద్రుండు గావించుమధుపర్కాదియథోక్తశుభసమర్చనంబులు
గైకొని నిజహృదయచిరమదనవహ్నికిం బ్రశామకంబుగా నతం డొసగుకన్యాదా
నోదకధారం బరిగ్రహించి కౌశేయయవనికావ్యవహిత యగు కుంతలేశ్వరదుహితం
గదియ వచ్చె నప్పుడు.

178


క.

ఒండొరుఁ గనుగొనఁ దివురుచు, నుండువధూవరుల మదనుఁ డొగిఁ దూపులచే
నిండుదెరచాటు గైకొని, రెండును దనయంపదొనలు రిత్తగ నేసెన్.

179


క.

వెలిపట్టుపచ్చడముతొర, వొలిచె వధూవరులమధ్యమున వారిమది
న్వలరాచశివముఁ గొలుపఁగఁ, దొలితొలిఁ గర్పూరధూపధూమం బనఁగన్.

180