పుట:కవికర్ణరసాయనము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తమకమునఁ బాదలాక్ష యంగమున నలఁది, నృపతిఁ గన్గొనవచ్చెఁ గన్నియ యొకర్తు
విటులనెత్తుట జొత్తిల్లి వెఱపుఁగఱపు, మకరకేతనుఖడ్గపుత్రికయుఁబోలె.

154


క.

ఇల ఱేనిఁ జూడఁ జనుతమి, లలన యొకతె తడబడినయలంకారముతో
వలయువడి గూడనిపద, స్ఖలనంబును గలిగి కుకవికవితయుఁ బోలెన్.

155


ఉ.

ఆరనిచెక్కులేఁజెమట లప్పటియుం బొడమంగ నిక్కు చొ
ప్పారనిమేని ముత్పులక లగ్గల మై యుదయింప మ్రానుపా
టారనిచూడ్కి వెండియును నన్నున సోల రతాంతతాంతి య
ల్లారక మున్న వచ్చి యొకయంగన చూచె నరేంద్రచంద్రునిన్.

156


ఉ.

భారపునిండువెక్కసపుఁబ్రాయపుజవ్వని యోర్తు మందిర
ద్వారమునందు నిల్చి నృపవంశమనోభవుచిత్తమోహనా
కారముఁ జూడ నంగజవికారవశంబున నీవి జారినం
గూరినసిగ్గుమైఁ దలుపు గొబ్బున మాటుగఁ జేసె నాభికిన్.

157


ఉ.

అంబుజనేత్ర యోర్తు వసుధాధిపుఁ గన్గొనుచో రసాతిరే
కంబునఁ జేత మున్ను తమకంబునఁ దెచ్చినదర్పణంబునం
బింబిత మైనరాజుప్రతిబింబము చెక్కుల నొక్కి గ్రక్కునం
జుంబన మాచరించి చెలిఁ జూచి ముఖాబ్జము వంచె సిగ్గునన్.

158


తే.

మానలేక నిగిడ్చిరి మఱియు మఱియు, సతులు దృగ్జాలములు రాజచంద్రుమీఁద
నతనిలావణ్యజలధితో నణఁగియున్న, తమి మనంబున శోధింపఁ దలఁచిపోలె.

159


క.

పెల్లుకొనఁ గురిసి రప్పుడు, దల్లుగఁ దమచూడ్కులకును దల మిచ్చుచు భూ
వల్లభుపైఁ బురభామలు, కొల్లలు గా లాజమిళితకుసుమాంజలులన్.

160


వ.

ఇట్లు పౌరవిలాసినీదృక్చకోరచంద్రుం డగుచుఁ జనుదెంచిన రాజచంద్రుం గుంతలేశ్వ
రుం డాత్మనిర్దిష్టంబుకు మంగళాలంకృతంబు నగువిడిది విడియించి యితరసామంత
మంత్రిపరివారచమూవర్గంబులఁ దగిననెలవుల విడియించి యుచితోపచారంబులం
బ్రీతులం గావించి వివాహమంటపంబునకుం దగినవస్తువు లొడఁగూర్చుటకుఁ దగు
వారి నాదేశించి యనంతరంబ పతంగుం డపరదిగంగనాసంగతుం డగుచు వచ్చినం గు
మారిక నలంకరింప నియమించినం బనిపూని పాలికాదిసఖీజనంబు లంతిపురంబున.

161

సఖీజనంబు విమలాంగి నలంకరించుట

,

తే.

విరహపరితాపశాంతికై వెలఁది మున్ను, చలువలొనరించినట్టి తులనె నీకుఁ
బరిణయాలంక్రియలు సేయుభాగ్య మబ్బెఁ, జెలియ! ము న్నేమినోము నోఁచితిమొ మేము.

162


వ.

అని వెండియు.

163