పుట:కవికర్ణరసాయనము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నయంబ యవలంబనీయం బని యప్పుడు మౌహూర్తికుల రావించి చేరువన లగ్నంబు
నిశ్చయించి దూతపురుషు నుచితసత్కృతులఁ బ్రీతునిం గావించి నిజపురోహిత
సహితంబుగా నతని నయోధ్య కనిపి శుభలేఖాప్రేరణంబున నిజనిఖిలబంధుహితలో
కంబు రావించి పరిణయోచితసమస్తవస్తు పత్సంపాదనంబునకుం దగినయధికారుల
నియమించి పురంబుఁ గైసేయం బనిచి నిజరాష్ట్రంబున నయోధ్యానగరమార్గంబున
విడుదు లాయితంబు సేయించి జామాతృసమాగమప్రతీక్షాపరుం డై యుండునంత
గతిపయదినాంతరంబున.

148

మాంధాత విమలాంగిం బెండ్లాడఁ గుంతలేశుపురి కేతెంచుట

శా.

సప్తద్వీపధరాధవు ల్నిజచమూ సంయుక్తులై శ్రీకరుల్
సప్తాశ్వాన్వయజు ల్భజింపఁ ద్రిదశాశ్చర్యప్రదం బై జగ
ద్వ్యాప్తాశ్చర్య మెలర్ప వచ్చెఁ దగ మాంధాతృక్షమాభర్త సం
ప్రాప్రాభీష్టమనోరథం బగుటకున్ భావంబునం బొంగుచున్.

149


వ.

ఇ ట్లరుగుదెంచి నిజబంధుసామంతసేనాసమేతుం డై దూరంబున గుంతలేంద్రుం డెదు
రుకొని తోతేర మంగళాలంకారసంకులం బైనతేదీయపురంబుం బ్రవేశించి రాజమా
ర్గంబునం జనునప్పుడు.

150

పౌరకాంతలు రాజమార్గమున మాంధాతం గనుంగొనుట

సీ.

క్రొవ్వెద యూఁదినకుడిచేతికరమూల, కాంతులు కేయూరకాంతిఁ బొడువఁ
బెఱకేలి కందనిబిగిగుబ్బచనుఁగ్రేవ, నిగ్గుపయ్యెదకు వన్నియ యొసంగఁ
దఱుచుటూర్పులతావి కెఱఁగుముందటితేంట్ల, దివిరెడునునుఁజూడ్కి తెలుపు సేయఁ
గడుఁబేద యగుకౌను గమనవేగంబున, మెలఁ పేది జవజవ జలదరింపఁ


గీ.

గుఱుచనెట్టున నందియల్ చరచి మెరయఁ, బిఱుఁదువ్రేఁకంబుచే నీవి బిగువు సడలఁ
జూపఱుల కెల్లఁ దనుఁ గనుచూఱ యొసగిఁ, వేగ పరతెంచి చూచె భూవిభు నొకర్తు.

151


చ.

తరుణి యొకర్తు కంఠమునఁ దాల్పఁగఁ దావస మేది హారముల్
కరములయందుఁ బూని పతిఁ గన్గొన వచ్చె రయంబుమై స్వయం
వరమునఁ దాన మున్ను నృపవర్యు వరింపఁగఁ గోరి మంగళా
విరళమధూకదామకము వేడుకఁ జేకొని వచ్చెనో? యనన్.

152


చ.

నెఱఁకులు గాఁడ దన్మరుఁడు నిర్దయుఁ డేసినతూఁపు లేఱి య
త్తెఱఁ గెఱిఁగింప భూపతికిఁ దెచ్చుగతి న్వస దోఁప విచ్చుచోఁ
దురుమ నెఱుంగ నొక్కసతి తోడన తెచ్చినఁ బొల్చెదో యిటన్
గిఱికొనుపాణిపద్మరుచిఁ గెంపు వహించినకమ్మగ్రొవ్విరుల్.

153