పుట:కవికర్ణరసాయనము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కూయఁగ నిమ్ము కోయిలలఁ గోపము దీరఁగ బువ్వుఁ దూపు లి
ట్టేయఁగ నిమ్ము మన్మథుని నీయెడ దూఱఁగ నీకు నేటికిన్?
మ్రోయఁగ నిమ్ము తుమ్మెదలఁ గ్రూరత మై నను నేఁచు బెల్లఁ దా
రీయుదయించువెన్నెలపయిం బడునంతకుఁ గాదె కోమలీ!

130


క.

చిచ్చునకు గాడ్పు దోడై, వచ్చినగతి మరుని కబ్జవైరియుఁ దో డై
వచ్చె నదె యాస వల దిఁక, మచ్చిక దలపోసి నన్ను మది మఱవకుమీ.

131


వ.

అని యఖండపాండురప్రభాడంబరంబున నంబరంబుఁ గబళించుచు శుభ్రకరుం డభ్యు
దయవిభ్రమంబు చూపిన.

132


చ.

పొడిచిన చంద్రుఁ జూచి నృపపుంగవ! వచ్చితె? యంచు లేమపైఁ
గడువడిఁ గేలుసాఁచి బిగికౌఁగిటి కందక యున్న పూనిక
ల్పడలి విషణ్ణ యై మరల శయ్యపయిం బడి వెచ్చనూర్చున
ప్పడఁతి మనోజతీవ్రశరబాధలఁ జిత్తగతుల్ భ్రమించినన్.

133


వ.

ఇట్లు చిత్తవిభ్రమణరూపం బైనదశాంతరంబు నొంది వెండియం శశిమండలంబుపయిం
గన్నిడి.

134


ఉ.

నిప్పులకుప్ప మింట నదె నెచ్చెలి కా దది చంద్రబింబమో
యప్ప! యదేల మీఁదఁ బొగ యంగన! కా దది పైకళంకపుం
గప్పు తనింపఁజేయు నఁటె కల్వలఱేఁ డతఁ డేల సేయు నీ
ముప్పిరిగొన్నతాప మది మోహము నొందకు వే తలోదరీ!


వ.

అని సఖీప్రయత్నంబునం జంద్రుండ కా నెఱింగి నిజవిరహప్రవర్గ్యవహ్నికిం
బయఃప్రపూరం బైనచంద్రికాసారంబు దుస్సహం బగుటయుఁ గటకటం బడి
యుడురాజు నుపలక్షించి.

136


తే.

ఉవిద! వీఁడు సుధాంశుఁ డై యుండి తాప, మెట్లు సేయు వియోగికి నట్లు దలఁప
జలధి జన్మించునపుడె లక్ష్మంబుపేర, నడుమ హాలాహలముఁ దాల్చినాఁడు గాక.

137


తే.

పథికసంహారనిజపాపఫలమువలన, దినదినక్షయమునఁ గడతేఱి పోయి
విరహిజనపాపఫలమున వీఁడు మరల, ననుదినంబున కభ్యుదయంబుఁ బొందు.

138


తే.

హాలహలమునకంటె నీయమృతకరుఁడు
దుస్సహుం డనుదృఢబుద్ధి దోఁచె నాకు
మృడుఁడు హాలాహలము దక్క మింగెఁ గాని
వీని మ్రింగియు రాహువు వెడలఁ గ్రాయు.

139


క.

నిజ మెఱుఁగ లేదు లోకము, నిజగురుతల్పగుని యామినీపతి వీనిన్
ద్విజరా జనుచును బేర్కొను, గజగామిని నేతిబీఱకాయంబోలెన్.

140