పుట:కవికర్ణరసాయనము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని సపరివారంబు గా మదనదేవతాప్రార్థనం బొనరించి.

121


ఉ.

పత్రము పుష్పమున్ ఫలము భక్తి నొసంగెడువార మింతె యీ
మాత్రమునం బ్రసన్ను లయి మానినిఁ గన్గొనుఁ డయ్య! మీకృపా
పాత్రము గాఁగ నంచుఁ దగుభంగిఁ బికంబులఁ దేంట్లఁ జిల్కలం
బత్రము పుష్పము న్ఫల ముపాయన మిచ్చి భజించి యచ్చెలుల్.

122


సీ.

స్వర్ణకుంభములకు వర్ణలేపనముగఁ, జన్నులఁ గుంకుమం బలఁది యలఁది
వెడవిల్తునలుఁగులు వొడయుట గాఁ గన్ను, లెడవక పన్నీటఁ దుడిచి తుడిచి
లేఁతతుమ్మెదలకు మేతఁగా విరిదమ్మి, పుప్పొడిఁ గురులపైఁ బోసి పోసి
యనుఁగుఁజుట్టములతో నాలింగనంబు గాఁ, బదకరంబులఁ జిగు ళ్లదిమి యదిమి


గీ.

కప్పురపుధూళి మేనిపైఁ గుప్పి కుప్పి, విపులకదళీదళంబుల వీచి వీచి
విరహపరితాపవతి యైనవెలది కపుడు, చెలులు శిశిరోపచారము ల్సేయఁ జేయ.

123


ఉ.

ధాతుపటంబులం బొగసి డట్టపుఁబుప్పొడి రాఁజి చందన
వ్రాతముచేతఁ గాల్కొని ప్రవాళముఖంబుల వీవవీవ ను
ద్భూతమహార్చులం బెరిగి తోరపుఁగొజ్జెఁగ నీటిపేరిపె
న్నేతఁ బ్రతీప్త మయ్యెఁ దరుణీమణిపై విరహాగ్ని యెంతయున్.

124


మ.

పటకి న్నార్చినలీలఁ జందనము పైఁ బైఁ బూయ నంగారక
చ్ఛటలం గాఁచుతెఱంగునం జిగురు సెజ్జం బొర్లగా నప్పట
ప్పటికిం జేరఁగ నిచ్చిన ట్లొడలిపైఁ బన్నీరు చల్లంగ ను
త్కట మయ్యెం బెనుఁగాఁక బంగరుసలాకం బోలునబ్బాలకున్.

125


వ.

ఇట్లు విరహానలం బగ్గలించుటకు బెగ్గిలి నెచ్చెలులు శిశిరోపచారంబులు చాలించి
చంద్రమందానిలకందర్పాదులం బ్రార్ధించు టుడిగి వారిపయిం గినుక వొడమి.

126


ఉ.

పైకొని వచ్చె దేల? నినుఁ బాము దినం జలిగాలి! ప్రార్థనం
గైకొనవేల? చంద్ర! నినుగా మడువన్ మెలఁపేది ప్రేలెదో
కోకిల! యేటి కిట్లు? వినుఁ గొర్తఁబడం దరలాక్షి సేయునీ
పాకము దప్ప వేల? నిను భస్మము గా వలరాజ! యిత్తఱిన్.

127


తే.

తలఁప దోషాకరుం డఁటే తగినప్రాపు, సహచరుఁడు జాతిమాలినచైత్రుఁ డట్టె
యెప్పుడును నీవు నీయొడ లెఱుఁగ వింక, మదన! మఱి యేమి చెప్ప నీమధుపగుణము.

128


వ.

అనునంత నుదయగిరిశృంగాటకంబునం దుహినకిరణకిరణోదయసూచకం బగుచు నునుఁ
గెంపుజగజంపుగొనం గనుపట్టిన బిట్టులికి యబ్బాలిక పాలికకరంబు కరంబున నప్ప
ళించి యీరెలుంగున.

129