పుట:కవికర్ణరసాయనము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

తూలినమోముచెల్వుఁ బయిదూఁకొనుఘర్మజలంబువెల్లువం
దేలినమేను నెమ్మనముత్రిక్కులఁ జిక్కులఁ జేసి వెల్వడం
దోలినతాల్మి వల్లభుఁడు దోఁచినరిత్తకు రిత్తకౌఁగిటన్
పోలినచందముం గలయఁ జూచి వయస్యలు భీతచిత్త లై.

95


క.

తత్తఱిలువారి నందఱ, నత్తఱి మఱుపడఁగ నిలిపి యప్పాలిక దా
నత్తన్విఁ దెలిపి కౌఁగిట, నొత్తి కురు ల్నిమిరి యుల్ల మూఱడిలంగన్.

96


ఉ.

మచ్చిక గల్గునెచ్చెలుల మమ్ము మొఱంగి లతాంగి! యొంటి నీ
విచ్చటి కెట్లు వచ్చితివి! యీవనవాటిక దాదిప్రక్కయే?
పచ్చనివింటిజోదు తగుబందుగుఁడే? మఱి చిల్క లేమి నీ
నచ్చినతోడఁబుట్టుగులె? నాయము దప్పుఁ గ దమ్మ! యియ్యెడన్.

97


చ.

హిమకరుఁ డంకకాఁడు మధు వెప్పుడు జాతివిరోధి రాజకీ
రము ప్రతిపక్షి తెమ్మెరలు ప్రాణముదాయలు కాచియుండుఁ జూ
తము గడుఁజూడఁ జాలఁ డలదర్పకుఁ డింత యెఱింగియుం జెలీ!
మము సఖులం దొఱంగి రిపుమధ్యమ మీవన మొంటిఁ జొత్తురే.

98


చ.

మనమున నీవు గోరునృపమన్మథుతో నినుఁ బెండ్లి సేయ నీ
జనకుఁడు సంభ్రమించె నదె సమ్మద మొందుదు గాక బేలవై
వనరుహపత్రనేత్ర! యిటు నాఁగె వదల్చిన కోర్కులన్ మనో
జున కెర యచ్చి డిల్లపడఁ జూచినఁ జూచినవారు మెత్తురే?

99


వ.

అని సి గ్గెక్కించి పలికిన నెచ్చెలికంఠంబు కరంబులం బెనంచి తనవాడినవదనపద్మంబు
నోరగాఁ దదీయకుచమధ్యంబునం జిక్కం జేర్చి నిడుదకనుఁగొలంకులఁ గ్రొవ్వెఁడి
బాష్పకణపరంపర లొలుక నిట్టూర్పు నిగిడించి.

100


క.

మగబొమ్మఁ జూడ నొల్లని, ముగుదతనం బెల్ల మూలముట్టుగ నిటు పె
ల్లగిలించుకొంటి నేనే, తగనిమనోరథమువలనఁ దప్పదు చెలియా!

101


క.

చెలు లెఱిఁగిన నాడెద రను, తలఁ కది ప్రావడియె నీవుడు దర్పకశరబా
ధలవలన నాకుఁ బ్రాణము, నిలుపుట గండ మయినయది నిక్కము సకియా!

102


ఉ.

ఏయఁ దొణంగెఁ గంతుఁ డెడ యీక శరంబుల వేఁడివెన్నెలల్
గాయఁ దొణంగెఁ జందురుఁడు గర్ణపుటంబులు వీలఁ గోయిలల్
గూయఁ దొణంగె వల్లభులఁ గోరెడుకన్నెల కెల్ల నిట్టిదే
నాయమొ? లేక దైవ మిది నాకు ఘటించెనొ? నేఁడు నెచ్చెలీ!

103