పుట:కవికర్ణరసాయనము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వారణరాజయానకును వారము గుంతలమధ్యవీథి సిం
దూరము దూర మయ్యె మగతుమ్మెదప్రోడలు గోడగించుఝం
కారము కార మయ్యెఁ జెలికత్తియలం బలికించువాక్యసం
భారము భార మయ్యె మదిఁ బర్విననూతనకామవిక్రియన్.

87


చ.

విరులు సరంబు లయ్యె చలివెన్నెల యొట్టినమంట యయ్యెనుం
గరువలి వజ్ర మయ్యెఁ జెలికత్తియ యొప్పని దయ్యె హస్తపం
జరమునఁ బూని పెంచుశుకశాబకము న్బగచాటు దయ్యె న
త్తరుణికిఁ బంచబాణుఁ డనుదైవము దాఁ బ్రతికూల మౌటచేన్.

88


చ.

పులకకదంబము ల్నినిచె ఫుల్లముఖాబ్జవిలాససంపద
ల్దొలఁగె మరాళికాగతులు దూరము లయ్యె శ్రమాంబుపూరము
ల్వెలి విరియంగఁ జొచ్చెఁ బురివిచ్చి నటింపఁగ నెమ్మిగోరిక
న్బొలఁతుకయందు మన్మథుఁడు పూర్ణముగా శరవృష్టిఁ జూపఁగన్.

89


తే.

తాపమును బాండిమయు నాఁగఁ దరుణిమేన
రెండును వెన్నెలయుఁ గూడి రెండు నుండి
భావిలజ్ఞావినాశసంప్రాప్తికొఱకొ
ధైర్యహానికినో మహోత్పాత మయ్యె.

90


వ.

ఇ ట్లంతకంతకుఁ బెరుగువిరహపరితాపంబు నిలువరింపం గొలంది గాక నెచ్చెలులం
గనుమెఱంగి యొక్కనాఁ డొక్కతెయు మందిరారామంబునకుం జని.

91


సీ.

అలరు ఱేకులయలుఁగులు మీఁదఁ గురియుచోఁ, చేలకొంగుముసుంగు చేసి చేసి
చిల్కపల్కులు గాఁడి జీవంబు లెడలుచో, నంగుళంబుల వీను లాని యాని
యడుగులఁ బుప్పొడు లంటి చుఱ్ఱడుచుచో, నుస్సురు మని వెచ్చ నూర్చి యూర్చి
కమ్మదెమ్మెరలుపైఁ గలయంగ సోఁకుచో, వల్లరియునుబోలె వణఁకి వణఁకి


తే

సాహసమె తోడు గాఁగఁ నచ్చపలనయన, మందిరారామవాటికమధ్యవీథిఁ
దఱిసి చని యొక్క పుష్పలతాగృహమున, ధవళకరకాంతశయ్యపైఁ దనువు వైచి.

92


ఉ.

లేనిప్రియుండుఁ గన్గొనఁగ లేనివిలాపము విన్నవింపఁ గా
లేనిప్రియంబుఁ గైకొనఁగ లేనికడంకలుఁ గౌఁగిలింపఁగా
లేని ముదంబుఁ జేకొనఁగ లేనిరతు ల్మదిఁ బట్టుకొల్పఁగా
లేనిసుఖంబుఁ దాల్మిఁ గబళింపఁగ సింధురయాన దీన యై.

93


వ.

ఉండునంత నిచ్చటం బ్రియవయస్యం గానమిం జేసి చెలికత్తియ లెత్తినతత్తఱం
బున నత్తలోదరిపదారవిందంబులచొప్పునం జనుదెంచి యుద్యాననికుంజంబు డాసి
పరికించునప్పుడు.

94