పుట:కవికర్ణరసాయనము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కర మర్థి వేన పెనుపం, బెరిగినశుక మోట లేక ప్రేలుచు హృదయం
బెరియింపఁ దొణఁగె నింకం, బరభృతములు చెప్ప నేల పంకజవదనా!

104


చ.

వలపులఱేనిచేతివలవంతల కోర్వక చల్లగాలిపై
నొలయ నెదిర్చి యే శుకపికోక్తులకుం జేవియొగ్గి యేని మొ
క్కలమున మోకమావిపయిఁ గన్నిడి యేఁ దనువుఁ దొఱంగఁ గాఁ
జెలుల మొఱంగి యొక్కతియ సేరితి నీవనమధ్యకుంజమున్.

105


క.

చెప్పితిఁ దలంపు నీకుం, దప్పక యిది యెట్లు సేయు దాన న్వినుమో
యప్ప! రహస్యం బొక్కటి, యొప్పగుఁ గా కుండు నింక నోడఁగ నేలా!

106


ఉ.

సత్తుగ నోఁచ నెట్లుఁ బతిసంగతికిం బ్రతిరూప మేని నా
చిత్తము పూనికం గుఱుచచేసినపోలముతోడి నన్ బ్రియో
ద్వృత్తి విశాలవక్షమునఁ దేఱెడునట్లుగ వ్రాసి చూపి నా
యుత్తలపాటు మాన్పు మది నూఱడి వెన్నెలచిచ్చు చొచ్చెదన్.

107


వ.

అని సప్తమం బైనయవస్థాంతరంబు దేటపడం బలికిన నులికిపడి పాలికయు నిబ్బాలిక
మనఃపరిపాకంబుఁ బరికించినం గార్యంబుపరువంబు దప్పిన యది యైన నిరంతరం
బగుకంటె నిప్పటికిం గొంత యూఱడిలం బలికి తెలుపు టుచితంబుగా కేమి యని
లేనిబింకంబు దెచ్చుకొని.

108


మ.

అలరుందూపుల మూలపా ల్పఱిచి సొంపౌనిక్షుచాపంబునం
గలపెం పెల్ల దృణీకరించి మకరాంకం బవ్వలం ద్రోచి య
చ్చల మేపారఁగఁ జిన్నిబాలకులచేఁ జప్పట్లు వెట్టింతు న
వ్వలఱేనిం జెలి! యొక్కపోటుదొర గా వాలూఁది చింతింపకే.

109


సీ.

అహికులాధిపు వ్రాసి యంత్రించి దక్షిణ, గంధవాహునిరాక గట్టువఱకు
రాహుపూజాభిచారవిధాన మొనరించి, శశిబిట్టబిరుగుడు చంపి వైతు
నలు వైన శ్రీరామనామమంత్రంబుచేఁ, గలకంఠతతుల వాకట్టి విడుతు
సంపంగి నౌషధసంప్రయోగము చూపి, మొకరితుమ్మెదపిండు మూర్ఛవుత్తు


గీ.

భ్రాంతభూరుహముల గల్గుపండ్లు మిలిచి, త్రుళ్లుచిలుకలనాల్కల ముండ్లు విఱుతుఁ
బొలఁతి! నాయంతనెచ్చెలిప్రోడ గలుగ, నించువిలుతునివగకు నీకేల తలఁక?

110


తే.

డెందమునయందు వ్రీడ నాటింపవలదె? యఱితి హారంబు నులిగొన్న దకట! మేలె?
యొంటి నిల నేల! యిచటరా యుత్సలాక్షి! ప్రోదిచూతంబునకు నీరు వోయవలదె?

111


వ.

అనిన నప్పలుకులయెడ ననాదరంబు తేటపడ వెడనవ్వు నవ్వి.

112