పుట:కవికర్ణరసాయనము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ప్రథమహాలాహలప్రధమానకీల లై, వీఁచెఁ గ్రూరకటాక్షవీక్షణములు
దరహాసచంద్రికాంకురములు దల లెత్తె, నుదితేందుబింబ మై యొప్పె మొగము
సమసమున్మగ్నవాసనకుంభివరకుంభయుగ్మ మై కుచకుంభయుగళి దోఁచెఁ
బ్రకటసుధాపూర్ణరత్నకుండిక యయ్యె, నరుణాభ మై మధురాధరంబు


గీ.

విశ్వమోహనలీల నావిర్భవించి, మదనజగదేకపూజ్యసామ్రాజ్యలక్ష్మి
సతి పయోనిధి యై యున్న శైశవంబు, మహితయౌవనమంధానమథిత మైన.

18


చ.

ఉరుతరవజ్రకర్కశతయుం గుధరోన్నతియుం గుచంబులన్
సరసిజసద్వికాసమును జంద్రవిలాసము నెమ్మొగంబునన్
గరికరలక్ష్మియుం గదళికాతరువిస్ఫురణంబు నూరులం
బొరయుట చిత్రమయ్యె నృపపుత్రిక కాయెలజవ్వనంబునన్.

19


ఉ.

కన్నులఁ జంచలత్వమును గ్రౌర్య మపాంగవిలోకనంబులం
జన్నులఁ గర్కశత్వముఁ గృశత్వముఁ గౌనున మందభావము
న్నెన్నెడ వక్రతం గురుల నెక్కొనఁ జేసియు నెట్టిచిత్రమో?
కన్నియజవ్వనంబు త్రిజగజ్జనసన్నుత మయ్యె నయ్యెడన్.

20


ఉ.

నీరజసూతి దీనితనునిర్మితకాలమునందు డించినం
గారుమెఱుంగు లయ్యె నునుఁగాంతికి గీసినయట్టిపైపొరల్
సౌరభహీనభాగములు సంపఁగిక్రొవ్విరు లయ్యె మార్దవ
శ్రీరహితాంశము ల్నవశిరీషము లై విలసించె ధారుణిన్.

21


ఉ.

కారుమెఱుంగు లయ్యె నునుఁగాంతికిఁ బైపొర గీసివేయ బం
గారువు లయ్యెఁ జేసె గలఁగందినపల్లటుత్రోవఁ జంపకా
కారము లయ్యెఁ గర్కశత గల్గినప ట్లటువ్రేయ దీని న
న్నీరజసూతి సేయునెడ నిక్కమ నాఁ దను వొప్పె నింతికిన్.

22


చ.

కమలము మోమునందు నొకకన్నులమాత్రముఁ బోల దన్నచో
గమలవిరోధియందు నొకగండతలంబును బోలఁ డన్నచోఁ
గమలముఁ జందురుండు సరిగా రని వేఱ గణింప నేటికిన్
రమణిదరస్మితేక్షణతరంగితమోహన మైనవక్త్రమున్.

23


చ.

తరళగతిద్యుతిచ్ఛటలఁ దమ్మికొలంకులు సేయుదిక్కులం
గురియుఁ గటాక్షపాతములఁ గోణముల న్మదనాస్త్రవర్షముం
గరువపుఁజూపులం గొలుపుఱుమెరుంగులు మింటసాటియే
తరుణి విలోకనమ్ములకుఁ దమ్ములు నమ్ములు గ్రొమ్మెఱంగులున్.

24


గీ.

మహితకటిచక్రవక్షోజమండలంబు, లప్పు డకృశసమృద్ధిచే నతిశయిల్ల
సంతతక్షామ మిం దెట్లు సంభవించె, నాఁగ మధ్యప్రదేశంబు నాతి కమరె.

25