పుట:కవికర్ణరసాయనము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఒత్తుకొనివచ్చుకటికుచోద్వృత్తిఁ జూచి, తరుణితనుమధ్య మెచటికో తలఁగి పోయె
నుండెనేనియుఁ గనఁబడకున్నె యహహ! యుద్ధతులమధ్యమునఁ బేద కుండఁ దరమె.

26


సీ.

అవనిపై నుండుఁగా కనఁటికంబము లెట్టు లనఁటికంబములపై నవని నిలచె?
గగనంబు గిరులపైఁ గనుపట్టుఁ గా కెట్లు గగనంబుపై గిరు ల్గాన నయ్యె?
జలధరంబులమీఁద శశియుండుఁ గా కెట్లు శశిమీఁద నున్నది జలధరంబు?
నాళంబుపైఁగాక నలినకోశం బెట్లు నలినకోశంబుపై నాళ మున్న?


గీ.

దనుచుఁ జూపఱులకు విస్మయంబు గొలుపుఁ, దొడలుఁ గటిమండలంబును నడుముఁ జన్ను
లాననముఁ గొప్పు నాభియు నారుఁ నలర, నలరె విమలాంగి నవయౌవనాగమమున.

27


ఉ.

త్రాసునఁ దూఁపవచ్చు ముఖతామరసంబును నిండుచందురు
న్వాసి యెఱుంగరాదు మగవాలికమీలకుఁ గన్నుదోయికి
న్వీసము దప్పు లేదు నెరివేనలికిం జిఱుదేఁటిదాంట్లకుం
దోసముగాదె యయ్యతినతోఁ బెఱతొయ్యలి నీడుసేసినన్.

28


చ.

ఘనపథమధ్యనిర్భరము గా నుదయించి నిరుద్ధలోకలో
చనముగ సన్నికృష్ణముఖచంద్రము లై శ్రితతారకంబు లై
యనయము కుంభసంభవమహత్త్వవిజేతలు నౌటఁ గన్యకా
స్తనములు వింధ్యముం దెగడి సాటికి హెచ్చినమేరుకూటముల్.

29


మ.

స్మరసమ్మోహనమంత్రదేవత మనోజప్రౌఢసామ్రాజ్యల
క్ష్మి రమానందనభాగ్యరేఖ మదనక్రీడావనీపుష్పముం
జరి కామావరకీర్తి మన్మథపునస్సంజీవినీవిద్య నా
ధరణీశోత్తమకన్య యొప్పె విలసత్తారుణ్యసంపన్న యై.

30


వ.

ఇ ట్లభినవతారుణ్యభువనైకగణ్య యగునిజకన్యం గనుంగొని జయభద్రుండు దీనికిం
దగువరుండు స్వయంవరంబునం గాని కలుగం డైనం గలహమూలం బగుట నది
గా దని యత్యంతనిపుణులు నంతరంగులు నగు చిత్రకారుల మమ్ము రహస్యంబుగా
నియోగించినం బనిపూని నేమును విచిత్రచిత్రకళాకౌశలవశంబున నిఖిలదేశాధిపతులం
గనుంగొని యుపకృతుల మగుచు నందఱయాకారంబులు యథారూపంబును రహస్యం
బుగాఁ బటంబులం జిత్రించికొని వచ్చి వచ్చి యక్కన్యాభాగ్యపరిపాకంబున నస్మదీ
యతపఃఫలోదయంబున నిన్ను నిట్లు సందర్శింపం గంటి మిటమీఁదివిశేషం బొకటి
విన నవధరింపుము.

31


గీ.

కన్య యది యెట్టు లాలోకకారి యట్ల
యీవు నతిలోకతేజోభిహితుఁడ వగుట