పుట:కవికర్ణరసాయనము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాల్యయౌవనసంధివర్ణనము

క.

తొడరియుఁ దొడరనిసిగ్గునఁ, బొడమియుఁ బొడమనియురోజములఁజాపలమున్
విడిచియు విడువనినడపులఁ, బడఁతుకపై నూఁగునూఁగుఁ బ్రాయం బయ్యెన్.

10


చ.

దివసమువోలె శైశవము దీఱఁగఁ బ్రాయపురేయి దోఁచుచో
నవకపుమోవికెంపునఁ గనంబడియెన్ నెఱసంజవోలె న
క్కువలయపత్రనేత్ర నవకుంతలబాల తమోవితానముల్
గవియఁగఁ దానఁ బో మరునిగర్వము దుర్వహ మయ్యె నయ్యెడన్.

11


చ.

గురుకుచకుంభసంస్థితికిఁ గూడె నురంబున నాలవాలముల్
పొరసెఁ గురుల్ ముఖాబ్జమునఁ బొడ్మెడుతావికిఁ జేరుతేఁటు లై
గరువపుఁజూపు లోరసిలెఁ గన్నులక్రేవకు సి గ్గెలర్ప నా
వరనృపకన్యయం దభినవంబుగ జవ్వన మంకురింపఁగన్.

12


చ.

విరివియె కాని పైపొడవు వెల్వడ కుండెడుపూఁపచన్నులన్
సరవియె కాని దంతురత చాలనిసన్నపుముత్తరంగలన్
దరళవిధంబె కాని నిశితత్వ మెఱుంగనిక్రొత్తచూపులన్
సరసిజనేత్ర పొ ల్పెసఁగె శైశవయౌవనసంధిఁ జూడఁగన్.

13


సీ.

విస్తారవిలసనప్రస్తావనలు దోఁచె, సరవిఁ దటప్రదేశములయందుఁ
శ్రమముతోఁ దల లెత్తెఁ గడకంటిచూపుల, యందుఁ గౌటిల్యదూర్వాంకురములు
సరసవైదగ్ధ్యరసాయనోదయమునఁ, బలుకు లొయ్యొయ్యన పదనుకొనియె
నురముపైఁ జెక్కి పయోధరంబులు చేసె, లాలితోద్భేదకోలాహలములు


తే.

నవయవంబులు గైసేఁత లభిలషించెఁ, జెవులు సంభోగవార్తలచవులు మరిఁగె
జనవరాత్మజ కంతను శైశవంబు, వీడి క్రొత్తగఁ బ్రాయంబు గూడునపుడు.

14


వ.

అంతఁ గ్రమక్రమంబున.

15

నవయౌవనవర్ణనము

మ.

స్మరశాతావిలాసపుష్పమధుమాసం బక్షవృత్తిస్వయం
వర మాలోకనభాగధేయము మదస్వాతంత్ర్య మవ్యాజల
బ్ధరహఃకేళికళామనోరథలతోపఘ్నంబు నారోపితా
భరణప్రాయము ప్రాయ మయ్యువతిపైఁ బ్రాదుర్భవం బొందినన్.

16


చ.

కనగొని నిల్చుపేరనఁటికంబము లయ్యె మృదూరుకాండముల్
గువలయతోరణావలినిగుంభన మయ్యెఁ గటాక్షవిభ్రమం
బవిరళపూర్ణకుంభయుగ మయ్యె విరాజదురోజయుగ్మ మ
య్యవనిపకన్యయందు నవయౌవనలక్ష్మిసమాగమంబునన్.

17