పుట:కవికర్ణరసాయనము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ

తీవ్రచక్రనిహతిఁ దెగి కాళ్లు గుత్తుల, కొలఁది కూడి చనినఁ గూలఁబడక
నిలిచి పోరి రిపుడు నిజహస్తకుంతంబు, లూఁత గాఁగ వీరయోధవరులు.

161


క.

ఎడమకడవాఁడు వొడిచినఁ, గుడిచే బాణముల కొఱగి కొఱప్రాణముతోఁ
బుడమికి వ్రాలఁగఁ జేయం, బడకయు శరతల్పవసతి భటులకుఁ గలిగెన్.

162


గీ.

విడిచి వాటుల వీఁపున వెడలుగొరక, లొగ్గి నిలుపుటఁ గూలక మ్రొగ్గతిల్ల
నీటు దప్పని యరిగెలచాటుకలిమి, నీల్గియును గొంద ఱహితులు నిలిచి రాజి.

163


గీ.

నన్నుఁ జిన్నపుచ్చి నాకంబు పెద్దసే, యంగఁ బోవు టె? ట్లటంచుఁ బుడమిఁ
దెగినవీరులరుగుతెరు వరికట్టె నా, సమరధూళి మింట సాంద్ర మయ్యె.

164


గీ.

తూర్యములఁ బెట్టుచప్పుడు దోఁప కైన, కప్పుకొనుధూళి నొండొరుఁ గాన కైన
పోర నిరువాగునెదురుగఁ బొడుచుపోటు, లందు నొకటియు వృథగాదు క్రందుకలిమి.

165


క.

ఇలకును నింగికి భేదము, గలుగక రణధూళి పర్వఁగా నిరుమొనలన్
విలుకాం డ్రేసెడితూపులు, నెలవుగ నాకసము గాఁడి నిలిచె న్నడుమన్.

166


గీ.

తనువు తనువును దార్కొన్నదాఁకఁ గాన, రానిబలధూళిఁ జేతిశస్త్రములు వదలి
పొదివి యొండొరుఁ ద్రోపాడి పోరుకతన, మల్లుపోరాటమైఁ బోరు చెల్లె నపుడు.

167


క.

తొరఁగెడునెత్తుటఁ దేలియు, నొరిగెడుప్రాణముల నింగియును గప్పుచు నా
దురమున ధూళి యడంచిరి, పరస్పరాస్త్రముల గ్రువ్వఁ బడువీరభటుల్.

168


సీ.

చెఱకుసన్నిద మాడుతెఱఁగున గొడ్లండ్ల, నడుములు రెండుగా నఱికి నఱికి
యంత్రమాడెడుభంగి నట్టలు దలలును, విడసినధారల వ్రేసి వ్రేసి
కఱకుట్లు గ్రుచ్చుసంగతి నల్వు రేవుర, గుదులుగా గొరకల గ్రుచ్చి క్రుచ్చి
దొంతుల కుఱుకురీతుల నొడ్డణములతో, శిరముల దౌడలఁ జిదిపి చిదిపి


తే.

పల్లదమునఁ బల్కుపంతంబు నొకఁడుగాఁ, బోటుగరపుకన్న పోల్కిఁ జూపు
శివము లెత్తినట్లు చేతులతీఁట వోఁ, బోరి రిందు నందు వీరభటులు.

169


క.

ఇది హస్తం బది మస్తం, బిది తొడ మెడ డొక్క పిక్క యిది కాలిది వ్రే
లిది వదనం బిది రదనం, బిది యిది యని యెఱుఁగ కుండ నీల్గిరి సుభటుల్.

170


గీ.

ఉభయబలముల బిరుదురాహుత్తు లెదిరి, తోలుగుఱ్ఱంపుపౌఁజులధూళికతన
నపుడు కాలనిశావేళ యైనచోటఁ, దగియె ఖద్యోతనామంబు తపనునకును.

171


చ.

ఇతరబలాంగకోటి గలహింపఁగ సంగరభూతభోజనో
చితముగఁ బ్రోవు లై పడియెఁ జిత్రముగాఁ గవిరూపరూపము
ల్కుతలముదూఱున ట్లెదిరి గుఱ్ఱపురౌతులు వ్రేటులాడ న
ద్భుతముగఁ దద్భుజక్రియకుఁ బోలెడునట్లుగఁ గల్గెఁ బచ్చడుల్.

172