పుట:కవికర్ణరసాయనము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వీ ళ్లవి రెండుఁ బన్నుడు దివిం గలహాశనమౌనిచూడ్కు లు
వ్విళ్లు గొనంగఁ జొచ్చె నలవేల్పుపడంతులనెమ్మనంబు పిం
పి ళ్లొగిఁ గూయఁ జొచ్చెఁ దమిపెక్కువ మృత్యువు మ్రింగఁ జొచ్చె గ్రు
క్కి ళ్లవియంగఁ జొచ్చె రవికిన్ హృదయం బఖిలంబు నయ్యెడన్.

150


గీ.

పన్ని వేగిరించుపరనిజధ్వజినులఁ, జూచి కోప మేచి త్రోచి యపుడు
పోర నొండొకంటిఁ బొడుచుట కవనీశ, విబుధరిపులు గేలువిడుచుటయును.

151

మాంధాతృ రావణసైన్యములు ఘోరముగ బోరుట

క.

శ్రుతికటువుగ నిరువాగునఁ, జతురంగధ్వనులు తూర్యశబ్దము లేకా
త్మతఁ జూపుటయును దిక్కులు, ప్రతివాక్కులు గాన భిన్నభావము దెలిపెన్.

152


మ.

రతివాదంబులు దక్కి భర్తల స్వయంగ్రాహాంకపాలీసమ
న్వితులం గా నొనరింప సిద్ధవనిత ల్నిద్రాణకంఠీరవ
ప్రతతు ల్గర్జిల నమ్మహాబలయుగారావంబు భూభృద్గుహా
ప్రతిఘోషాధిపదీర్ఘ మై పగిలిచెం బంకేజగర్భాండమున్.

153


గీ.

కుంతములఁ జిమ్మి శక్తుల గ్రుచ్చి యెత్తి, ముసలముల మోఁది కరవాలముల దళించి
పరశువులఁ ద్రించి గదలచేఁ బంపు చేసి, ఘోరగతిఁ బేర్చి యిరువాగుఁ బో రొనర్చె.

154


క.

కలన నొక టొకటి మార్కొని, కలసి కచాకచి విచిత్రగతిఁ బోరఁగ నా
బలముల కుడిగె విభేదము, బలభటులకుఁ గలిగెఁ గాని ప్రత్యంగములన్.

155


సీ.

మది తత్తఱం బెత్తి మొదల మ్రొక్కులు చూపి, పట్టి పైకోకలు పాఱఁదిగిచి
కేలిమై గుణము లగ్గించి యగ్గించుచు, నడుములు డాకేలఁ దొడికి పట్టి
కుటిలభావములు గైకొని యున్నఁ బరికించి, పరుసనై రంపిల్లుబిరుసు మెచ్చి
పరిచితస్నేహానుపాకంబు మది నచ్చి, వదలక కొప్పులు వాలఁ దిగిచి


తే.

యచ్చలము మీఱ మెలసినయట్ల వచ్చు, తరుణులును బోనివిండ్లతో దండిమగలు
విషమశరఖేలనము చూపువేళయందు, నభినవకుతు లెసఁగె బెల్లంగములను.

156


క.

సలలితవికాసలక్ష్మీ, నిలయము లగుయోధవదననీరజములపైఁ
బొలసెఁ బరంపర లై యపు, డలఘుశిలీముఖకులంబు లారవ మెసఁగన్.

157


క.

తొడవినయొడలను ఱవికల, నెడలిచి యనురక్తరచన లేర్పడ భటులన్
మెడలు గబళించి వివశతఁ, బొడమించె న్శూరఖడ్గపుత్రిక లంతన్.

158


గీ.

పటవణించిన యరిగెలపౌఁజుమీఁదఁ, గూడి విలుకాండ్రు తూపులు గురియుమ్రోఁత
సమరవీరుల మ్రింగుకోపమున జముఁడు, పెటపెటనఁ బండ్లు గీఁటెడు పెల్లు చూపె.

159


గీ.

పోటుపూఁచి పట్టునీటెలు దగె రెండు, వీళ్లయందు సమరవీరవరుల
మ్రింగ వెఱచి యున్నమృత్యుముఖంబున, బయలువడినదంతపంక్తు లనఁగ.

160