పుట:కవికర్ణరసాయనము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఘోటకగజపాలురఘట, చేటీసల్లాపపరత శీఘ్రంబుగ నా
ఘోటకగజములు మాటికి, నీటికిఁ జనుతెరువు లెల్ల నిబిడము లయ్యెన్.

109


సీ.

వివిధపదార్థాభివిశదీకృతిం గృతి, వ్యాకర్తఁ బోలెను వైశ్యుఁ డప్పు
డాతిథ్య మొనరించి హరియించె వేశ్యాజ, నంబు సైనికులయర్థంబు లపుడు
హుంకారశతమున కొండోడకను గ్రాస, కబళము ల్భుజియించె గంధకరులు
ఘోటికాస్మృతి నగ్రఖురములఁ ద్రవ్వుచుఁ, గవణము ల్దినియె సైంధవకులంబు


గీ.

నిజనిజాహారతృప్తిమై నిఖలజనము, వేణువీణాదిబహుకలక్వాణ మెసఁగ
సరససంగీతగీతప్రసక్త మయ్యె, రమ్యతర మైననవశిబిరస్థలమున.

110

రావణుండు మాంధాతకడకు దూతం బంపుట

వ.

అనంతరంబ యంబుజహితుం డపరాంబుధిం గ్రుంకినం గృతోచితాచరణుం డై
యుత్తరకోసలేంద్రుండు కర్పూరతైలకరదీపికాసహస్రపరంపరసౌరభవిశేషంబులు
సేవాగతసామంతజనంబులు వివిధగంధానులేపసుగంధంబులతోడ సంబంధబాంధవం
బనుసంధింపఁ బ్రౌఢపాఠకోత్తములు నిజవిజయాంకమాలికాపఠనంబులవలన శ్రవణసు
ఖంబుగా ముఖరం బైనకొలువుకూటంబునఁ బేరోలగం బుండునంత దౌవారికుం డే
తెంచి మ్రొక్కి దూతపురస్సరుం డైనదైతేయుం డొక్కం డరుగుదెంచి మోసల
నున్నవాఁ డని విన్నవించిన నాకస్మికవిస్మయాయత్తచిత్తంబున నాస్థానం బెల్లం దదా
గమనసాపేక్షనిరీక్షణం బయ్యె నప్పు డయ్యధిపతియనుమతంబున నాహూతుం డై యే
తెంచి నిర్భయంబున నహంకారగర్భంబుగాఁ గర్ణకఠోరంబు లైనవచనసందర్భంబుల
గొలం వెల్ల వినం బెద్దయెలుంగున వాఁ డి ట్లనియె.

111


శా.

ఎవ్వం డిం దధినాథుఁడో? యతఁడ నా? లే తుచ్చుఁడా! మంత్రి యిం
దెవ్వండో వినుఁ డింకఁ దక్కినబలాధీశాఖ్యకీటంబు లిం
దెవ్వం డెవ్వఁడొ మీఁదిచే టెఱుఁగ రీహీ! నిక్కమే రాజు లై
క్రొవ్వు ల్మీఱ మదిం గృతార్థులగతిం గూర్చున్నవా రిందఱున్.

112


సీ.

కైలాసశిఖరంబు కందుకం బెవ్వని, కండూతి నిజభుజాదండములకుఁ
గృత్తాత్మశిరములు నెత్తమ్ము లెవ్వని, నీలకంఠార్చనానియమములకు
శతమఖాంతఃపురక్షితము లు గ్గెవ్వని, యుగ్రాసిపుత్రికాభ్యుదయమునకుఁ
గనకగర్భాండంబు కరఁగెడునుయిద యె, వ్వనిరోషశిఖిశిఖావైభవమున


గీ.

కతఁడు దుర్వారదిగ్విజయప్రయాణ, సరళమార్గాంతరాంతరసన్నివేశ
భవనవలయీకృతాఖిలభువనకుండు, రావణుఁడు వొల్చు విశ్వవిద్రావణుండు.

113


వ.

అమ్మహావీరుండు విశ్వవిజయధాటీసమాటోపంబునం బాతాళభూర్భువనంబు లాక్ర
మించి యెదుర్పడుశూరుండు లేక యుపరిలోకం బైనస్వర్గంబునకుం జనిన సునాసీరా