పుట:కవికర్ణరసాయనము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఆశ్రమించినశిఖిసమూహములు బెదరి, పోయినప్పుడు మునుకంటెఁ బొలిచె నడవి
మ్రాను లయ్యెడ వివిధసామంతవరుల, పరిజనముఁ జేర్చుపింఛాతపత్రతతుల.

99


చ.

పరువు లిడంగ నాత్మఖురపాతములం గనకాద్రిచెంగటన్
గర మపరంజిరామొరసుగట్టపునేలలు చూర్ణితంబు లై
ఖురళికలట్ల యాట బలఘోటకకోటికి సేద దేరఁగాఁ
బొరలుట కయ్యెడ న్వెదకఁ బోవల దయ్యె రజఃప్రదేశముల్.

100


ఉ.

కొంచెముగా నిజాంగకము గుంచి ధరిత్రికి నంతయంత లం
ఘించిన లేచుదంతిఁ బరికించు జనంబులు గొంత ఱాత్మ భా
వించి రవంధ్యవింధ్యపృథివీధరఘోరతరోదయంబు గా
వించిరి వేఱ కొందఱు త్రివిక్రమవిక్రమవిస్మయస్మృతిన్.

101


ఉ.

దాన నిరోధమయ్యెడువిధంబు నెఱింగి జలావగాహమున్
మానుప వేఁడి కాళ్లను బెనం గొనుపట్పదపఙ్క్తులో యనం
నవశృంఖలాలతలు గ్రందుగ మ్రోయఁగ నీడ్చికొంచుఁ బె
ల్లేనుఁగు లేగెఁ గొండసెలయేరుల మజ్జన మాచరింపఁగన్.

102


గీ.

తరళతరకర్ణహతిశంక దనిని నిగుడఁ, గ్రోలఁగా లేనితేఁటులకొదువ దీఱఁ
గ్రోలెఁ గండూయమానకపాలకషణ, వనకుజాసక్తజలమదావళమదంబు.

103


క.

తా నడ్డంబుగఁ దిగుచుట, నేనుఁగు మఱలంగఁ బఱచనేటికిఁ బ్రభవ
స్థాన మగునీలశైలం, బై నెగడం జూపఱులకు నద్భుత మొదవన్.

104


గీ.

నతజలావగాహనమున నుద్ధితము లై, క్రాలె వక్త్రకరికరంబు లపుడు
కుంభమణినిధానగుప్తికై యున్నత, ఫణము లైనకాలఫణులువోలె.

105


శా.

ఝంకారంబులపేర నింగి దనకై సంకల్పముం జెప్పఁగాఁ
గ్రుంకు ల్వెట్టినకుంభినీపతి దిశాకూలంకషామోదపా
హంకారంబుగ దాన మీ నలులకున్ హస్తోదకం బిచ్చున
టంకూరజ్జలబిందువు ల్నభము మూయం జేసె ధూత్కారముల్.

106


చ.

వనగజదానగంధి యగువాహిని వారికి నల్లియంతఁ గై
కొనక తటోపరిస్థలము కొమ్ములచే విడలింపఁ జొచ్చె నా
ననమునఁ గెంపు దేఱఁ బలనాగముపేర జలంబు గ్రోలఁగాఁ
దనకు సరోవరం బొకటి ద్రవ్వికొనం దలపోసియో యనన్.

107


గీ.

మావటీ లంగముల ధూళి వోవఁ గడుగ, మజ్జనం బాడి వెడలుచో మఱియు దాన
సామజంబులు ధూళి మైఁ జల్లుకొనియె, మందబుద్ధుల కొకనియమంబుగలదె?

108