పుట:కవికర్ణరసాయనము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చేయింపవలయుపనిఁ దాఁ, జేయుట కర్జంబు గాదు శీఘ్రమ తానై
చేయంగవలయు కార్యము, సేయం బనుపుటయుఁ గాదు సిద్ధము పతికిన్.

47


క.

స్థానబలంబున నధికుని, హీనుఁడు మెప్పించు బయిల నేగుక్కలకున్
లోనగు మొసలి యుదగ్రత, నేనుఁగుఁ బడఁ దిగుచుఁ గాదె యిరవున నున్నన్.

48


క.

ఊహ చెడి ఱేఁచఁబడెడు మ, హాహితుకోపాగ్ని పిదప నార్చుటకొఱకై
స్నేహము నెఱపఁగఁ జూచుట, మోహం బభివృద్ధిఁ బొందు మునుపటికంటెన్.

49


క.

అధముఁ డని రిపుఁడు లోనగు, విధ మెఱుఁగక యెత్తి పిదప వెడఁదిరిగినయే
నధమత మానిచి వానికి, నధికత నొసఁగంగఁ బోవు టండ్రు వయజ్ఞుల్.

50


వ.

ఇంక విపత్తిప్రకారంబును గార్యసిద్ధియు ననిష్టనివృత్తినిరాపణంబును నిష్టప్రాప్తిరూ
పంబును బరస్పరసాకాంక్షంబు లై ప్రాప్యంబు లగుటంజేసి రాజులకు నీరెండును
ద్వివిధం బైనకార్యఫలం బిది యెఱుంగునది.

51


క.

సకలానిష్టంబును బా, యక యిష్టప్రాప్తివలన నయ్యెడుసుఖ మే?
మొకచే ననలము దరికొన, నొకచేఁ జందనముఁ బూయ నూఱటఁ గనునే.

52


క.

కావున నాత్మాభ్యుదయ, శ్రీవిభవ మరిక్షయంబుఁ జేకుఱు నయబా
విక్రమముల నఖిలధ, రావల్లభుఁ డైన యతఁడు రాజనఁ బరఁగున్.

53


శా.

సర్వక్షోణితలంబు నేకధవళచ్ఛత్రంబు గా సంతతా
ఖర్వశ్రీఁ దిలకింపఁ నేలుము భుజాగర్వాతిరేరోన్నతిన్
బూర్వాస్తాచలమధ్యదేశనివసద్భూపాలమాళిస్ఫుర
ద్గీర్వాణాధిపరత్నరుఙ్ముధుకరోద్దీప్యత్పదాబ్జుండ వై.

54

యువనాశ్వుఁడు మునియై వనమున కేగుట

క.

అని దీవించి నిజాత్మజు, వినయవినమ్రతకు నలరి వీడ్కొని చనియెన్
మునివేషంబునఁ బావన, వనవాసంబునకు లోకవర్ణితయశుఁడై.

55

మాంధాత ధర్మిష్ఠుఁడై భూమి నేలుట

మ.

జనకుం డేగినయట్టిపిమ్మట మహాసామ్రాజ్యభారంబు గై
కొని మాంధాతృమహీవరుండు గరచెన్ ఘోర ప్రతాపాగ్నులన్
వనజాతప్రభవాండభాండపరిపూర్ణం బైనదృప్యన్నరేం
ద్రనిజస్ఫీతయశఃప్రపంచనవనీతంబు ల్గడు న్వేల్మిడిన్.

56


సీ.

వక్రభావ మధిజ్యవరధన్వమునఁ గాని, తన నెమ్మనంబునఁ దగులనీక
నిశితస్వభావంబు నిజడ్గమునఁ గాని, తనవర్తనంబులం దగులనీక