పుట:కవికర్ణరసాయనము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

పోయి పెద్దదూరమున నొకమునియాశ్ర, మంబు చేరి చొచ్చి మౌని నచటఁ
దడవి కానలేక తత్పర్ణశాలికా, భ్యంతరంబు దఱిసి యరసె నందు.

29


క.

కందుకముఁ బోనితెల్లని, యండం బొక్కటి మృదుచ్ఛదాచ్ఛాదితమై
యుండఁగ నద్భుతరసమ, గ్నుం డగుచుం గదిసి పుచ్చుకొని ముద మొదవన్.

30


శా.

ఔరా! యిట్టివిచిత్ర మేఖగజమో యండం బి దిమ్మౌనియే
లారక్షించునొ మూల డాఁచి యని లీలాకందుకక్రీడమై
నారాజన్యుఁడు చేతఁ బట్టికొని రా నయ్యండ మయ్యాశ్రమ
ద్వారప్రాంతమునం బ్రమాదమున హస్తస్రస్త మై భూస్థలిన్.

31


గీ.

పడినయంతఁ బెక్కు పఱియ లై నెఱవుగాఁ, గలల మచట వఱదగట్టుటయును
దలఁకి మానిరాకఁ దలపోసి మునుమును, చనియె మునియు వచ్చి చాల నడలి.

32


మ.

తనప్రాణేశ్వరి తొల్లి యంచల వినోదవ్యాప్తి సాకాంక్ష జూ
చినయాకోర్కి నెఱింగి యయ్యతివతోఁ జిత్రప్రభావంబు పొం
దున హంసాకృతు లై రమించుటయు సద్యోగర్భజం బైన దాఁ
చినవాఁ డౌటఁ దదండభంగమునకుం జింతాతీసంతప్తుఁ డై.

33


గీ.

చింత దేఱి యిట్లు చేసిన యతులపా, పాత్మకుండు గర్భ మవసిచచ్చుఁ
గాక యని శపించె భూకాంతుఁ డిట ధాత్రి, నేలుచుండఁ గొంతకాలమునకు.

34

యువనాశ్వుఁడు పుత్త్రులులేమిఁ బరితపించుట

గీ.

భువనభరిత మగుచుఁ బొదలు విభాతవి, స్ఫురణ నడఁచుమంచువోలె మ్రింగె
విభునిమనసులోని విశ్వభూచక్రాధి, పత్యసమ్మదము నపత్యకాంక్ష.

35


సీ.

నందనుఁ జూడ నానందించుచూడ్కుల, కెవ్వియుఁ జూడంగ నేవ మయ్యెఁ
దనయానులాపంబు వినఁ గోరువీనుల, కెవ్వియు నాలింప నేవ మయ్యె
సుతుమౌళి మూర్కొనఁ జూచుఘ్రాణంబున, కెవ్వియుఁ బసిగొన నేవ మయ్యెఁ
గొడుకుతియ్యనిపేరు నుడువఁ గోరెడుజిహ్వ, కెవ్విముఁ జవిఁగొన నేవ మయ్యెఁ


గీ.

బట్టి కౌఁగిటఁ జేర్పంగఁ బరఁగుమేని, కితర మెవ్వియు సోకంగ నేవ మయ్యె
విశ్వభూమీశుఁ డగుయువనాశ్వపతికి, సుతుఁడు వెలి యైన బ్రదు కేమి సొంపు దలఁప.

36


క.

సంతతిలేమికి నాభూ, కాంతుం డెంతయును వంత గడలుకొనంగా
సంతతదురంతచింతా, క్రాంతస్వాంతం బొకింత గళవళపడఁగన్.

37


శా.

ఏలా యేలితి విశ్వభూవలయ మి ట్లేకాతపత్రంబుగా?
నేలా తోలితి గర్వితారినృపులన్ హేమాచలం బెక్కఁగా?
నేలా వ్రాలితి యాచకావనకథాహేవాకసంపత్తి? నిం
కేలా బిడ్డలు లేనియీబ్రదుకు? గొడ్డేఱయ్యెఁ జింతింపఁగన్.

38