పుట:కవికర్ణరసాయనము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

జలక మార్చినఁ జిన్ని శయ్యలో నొయ్యొయ్యఁ, గాలు చే యార్పంగఁ గనుట లేద
కెంగల లేబొజ్జగిలిగింత లిడి నవ్వు, నెలమోముఁ దమ్మి ముద్దిడుట లేద
తియ్యఁదేనియ లొల్కుతీపనవ్వులతోడి, తొక్కుపల్కులు విని చొక్క లేద
వడఁకుతోఁ జిఱుతప్పుటడుగుల నేతేరఁ, జేచాఁచి యక్కునఁ జేర్పలేద


గీ.

పుత్రకులు లేనిసిరి యేల భోగ మేల, బాలకులు లేనితా నేల బ్రదు క దేల
యాత్మజులు లేనిశయ మేల హర్ష మేల, యహముఁ బర మెద్ది సంతానహీనులకును.

39


ఉ.

ముంగిటనాడుపుత్రుఁ డతిమోదమునం దను దౌలఁ గాంచి వే
డ్కం గరయుగ్మమెత్తి చిఱుగంతులతో వెడయేడ్పుతోడ డా
యంగఁ జెలంగి యెత్తికొని యక్కునఁ జిక్కఁగఁ జేర్చి ముద్దు మో
ముం గమియార ముద్దిడుట ముజ్జగ మేలుట గాకయుండునే.

40


వ.

అదియునుంగాక.

41


ఉ.

నారకయాతనాంబుధికి నావ నిబద్ధకవాటగోపుర
ద్వారమునందుఁ గుంచిక భవక్షితిజంబునకున్ ఫలంబు వి
స్ఫారనిజార్థగుప్తిత్రీ కనపాయనిధిస్థలి వంశవర్ధనాం
కూరము పుత్రునిం బడయఁ గోరుట యొప్పదె యెట్టివారికిన్?

42

యువనాశ్వుఁ డింద్రయాగము సేయుట

సీ.

అని చాలఁ జింతించి యాకోర్కి యాత్మీయ, కులగురుం డగుమౌనికులగరిష్ఠు
నకు వసిష్ఠునకు విన్నపము సేయుటయు న, య్యుగ్రాంశుకులు నతఁ డూరడించి
తగిననానావిధద్రవ్యముల్ దెప్పించి, హోతల రప్పించి యుక్తవిధుల
శతమఖప్రీతిగా నతులితక్రియ నొక్క, యింద్రయాగంబు సేయించుటయును


గీ.

దూర్ణమున నధ్వరక్రియ పూర్ణ మైన, మహిత మగు వేదమంత్రాభిమంత్రితాక్ష
తములు చల్లినకలశోదకములు దెచ్చి, భూతలాధీశునకుఁ జూపి హోత లపుడు.

43


క.

ఆలింపుమీ జలంబులు, గ్రోలినప్రాణికి నృపాలకులమౌళిమణీ!
వేలావలయితధరణిం, బాలింపం గలుగుసార్వభౌముఁడు పుట్టున్.

44


గీ.

అని యెఱిఁగించి దాపించి రవి మహీశ, వరుఁడు నారాత్రి యెల్ల జాగరము చేసి
మౌనివాక్యం బమోఘంబు గానఁ దెలివి, దప్పి డప్పికి నానీరు ద్రాగుటయును.

45

మాంధాతృజననము

ఉ.

గర్భము నిల్చి కుక్షి యధికంబుగఁ గానఁగ వచ్చి గ్రక్కునన్
దుర్భరతీవ్రవేదనల దూలుచు సోలుచు నేల వ్రాలఁగా
నర్భకుఁ డొక్కఁ డయ్యినకులాగ్రణిగర్భ మగల్చికొంచు నా
విర్భవ మొందె భూజనులు విస్మయమగ్నులు గాఁగ నయ్యెడన్.

46