పుట:కవికర్ణరసాయనము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అజహచ్చంద్రవిజృంభముల్ శుకపికాధ్యారూఢనానావిధ
ద్విజమృష్టాన్నయథేష్టసత్రగృహముల్ దీవ్యన్మదోత్సేకభా
వజసర్వస్వము లంచితానిలనిజస్వారాజ్యము ల్దంపతీ
వ్రజతారుణ్యసమృద్ధిసాక్షులు పురప్రాంతస్స్థితారామముల్.

23


చ.

అలికులకుంతలంబులు రథాంగకుచంబులు పద్మవక్త్రముల్
గలరవపద్మినుల్ గడువికాసముతోఁ దమయందు సక్త మై
యలర విహారవేళఁ దము నంటినకాంతలమేనికస్తురిన్
జులకన సోడుముట్టు సరసు ల్సరసుల్వలె నొప్పు నప్పురిన్.

24

గంధవహవర్ణనము

సీ.

ప్రణయవాదములు దంపతులందు నుదయించి, రంజిల్లు మానాంకురములు మేసి
సురతాంతవిశ్రాంతసుందరీజనముల, వక్షోజతటఘర్మవారిఁ గ్రోలి
వనములు మధుగర్భవతులు గాఁ బూమొగ్గ, మొదవులకొమారములు హరించి
విషయానుభవకథావిముఖవిరక్తుల, పటుతరధైర్యవప్రములు గూల్చి


గీ.

గంధలోభానుబంధిపుష్పంధయముల, ఝంకృతులచే ఘణి ల్లన ఱంకె లిడుచు
విషమశరుపేర జన్నియవిడిచిరనఁగఁ, గ్రొవ్వి చరియించు నవ్వీటఁ గోడెగాడ్పు.

25

సాకేతాధీశ యువనాశ్వవర్ణనము

మ.

ఇట్టివిలాసలక్ష్మి దనకీడును గీడును లేనియమ్మహా
పట్టణ మేలు నుద్ధతసపత్ననృపాలకఫాలపట్టికా
పట్టనవాతతస్ఫురితపాదసరోరుహుఁ డష్టదిక్తటీ
హట్టచరత్ప్రతాపహరిదశ్వుఁ డనా యువనాశ్వుఁ డున్నతిన్.

26


సీ.

తన భూభరణదక్షతకు మెచ్చి ఫణిరాజు, చులుకన యగువేయుఁదలలు నూఁపఁ
దనఖడ్గపుత్రి శాత్రవుల నచ్చరలను, జిన్నిబొమ్మలపెండ్లిఁ జేసి యాడఁ
దనమూర్తి సుందరతాగర్వవతు లైన, సతులమానసములఁ బ్రతిఫలింపఁ
దనకీర్తివల్లికాతతుల కాశాధివ, కుంభిదంతములు వేఁగొనలు గాఁగఁ


గీ.

బ్రస్తుతికి నెక్కి సతతధారాళనైజ, దానచిరవాసనావాసితప్రపంచ
రంజనైకమహారాజకుంజరంబు, విశ్వభూభర్త యై యువనాశ్వవిభుఁడు.

27

యువనాశ్వునకు మునిశాపము గల్గుట

శా.

ఆరాజోత్తముఁ డొక్కనాఁడు మృగయావ్యాసక్తిఁ గాంతారకాం
తారంబుల్ వెసఁ జొచ్చి వాహముఖఫేనంబుల్ వనీదేవితా
హారప్రౌఢి ఘటింపఁగా జనియె మధ్యాహ్నాతపక్లిష్టసే
నారాహిత్యముఁ బొంధి దప్పిఁబడి ఖిన్నస్వాంతుఁ డై యొక్కఁడున్.

28