పుట:కవికర్ణరసాయనము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

క్షితిసుర లొనర్పుసతత, క్రతువుల నాహుతులు గొనుచుఁ గాఁపున్నసుర
వ్రతతులవిమానములయా, కృతులం బొలుపారు వీటఁ గ్రీడాగృహముల్.

15


క.

వేడుకఁ బతులుం దామును, గ్రీడాగేహములు చొచ్చి కెలనం దెలిరా
గోడలఁ గనుపట్టెడుతమ, నీడలు సవతు లని మానినీజన మలుగున్.

16


శా.

దర్పం బేర్పడ ముగ్ధలం బతులు నూత్నక్రీడకుం దార్చి కం
దర్పుం డార్వఁగ నీవిబంధనములం దప్పింప నవ్వీటిలో
నర్పించుం బునరంశుకస్థితిఁ ద్రపాహైన్యం బభావంబుగాఁ
గర్పూరాగరుధూపధూమపటలీగాఢాకృతీప్రక్రియల్.

17


శా.

కేలీగేహసరోమరాళమిథునక్రేంకారముం గన్యకా
డోలాకాంచనకింకిణీఘనరవాటోపంబు నృత్యన్నటీ
హేలానూపురశింజితంబుఁ బురి నింపేపారఁగా లోఁగొనుం
గాలోద్యత్పురుషాయమానగణికాకాంచీకలక్వాణముల్.

18


ఆ.

ఉచితసమయ మగుటయును రత్నగర్భప్ర, సూతి నొందియున్నచొప్పు మెఱయ
వివిధమణిసమృద్ధి వీక్షింపఁగా నొప్పు, నప్పురంబులోన నాపణములు.

19

వేశ్యావర్ణనము

సీ.

గమనంబులేచాలుఁ గన్నులు దనియింప, నృత్తంబు లేలకో నేర్చి రిట్లు
పలుకులే చాలు వీనులకుఁ బండువు సేయ, నెఱపాట లేలొకో నేర్చి రిట్లు
సౌందర్యములె చాలు సమ్మోహనమునకు, నేపథ్య మేలకో పేర్చి రిట్లు
తారుణ్యములె చాలుఁ దలఁపులు గరఁగింప, నెఱతనం బేలకో నేర్చి రిట్టు


ఆ.

లిది ప్రియాతిరేక మిది గదా నఖముఖ, సాధ్యమునకుఁ బరశుసంగ్రహంబు
వీరు గలుగ మరుఁడు విజయగాఁ డెట్లన, వఱలుదురు పురంబువారసతులు.

20

పుష్పలావికావర్ణనము

సీ.

కరముల కందిచ్చువిరులబంతులకంటె, వెడఁదోఁచుచన్నులు వేడ్కఁ బెనుప
మవ్వంపుగొననెత్తుపువ్వుటెత్తులకంటెఁ, గరమూలరుచిచూడ్కిఁ గమిచి తిగువఁ
గోరిన నొసఁగెడుకొసరుపువ్వులకంటె, మొలకనవ్వులు డెందములు గరంప
నిండారుసరములనెత్తావిగమికంటె, సుముఖసౌరభములు చొక్కుఁ బెనుప


ఆ.

జట్టికాండ్రఁ దమదుసరససుందరవిలా, సములచేతఁ దార జట్టిగొనుచుఁ
బురమువీథులకును భూషణప్రాయ మై, క్రాలుఁ బుష్పలావికాజనంబు.

21

పౌరవిలాసినీవర్ణనము

గీ.

అంగరాగంబు దమవెలయాట నంత, రంగరాగంబు నొసఁగెడునప్పురంబు
గట్టివాలుపడంతులు కంతుచేతి, గట్టివాలున కొప్పింతు రెట్టివారి.

22