పుట:కవికర్ణరసాయనము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రేణీనిర్మలకుట్టిమంబులపయిన్ శీతాంశుఁడున్ బేద యై
ప్రాణాచారము వడ్డయట్ల ప్రతిబింబవ్యాప్తి చూడం దగున్.

7


చ.

అహరహముం బ్రభాతముల హర్మ్యతలోపరిచంద్రశాలికా
గృహములఁ గామినీసురతకేలివిసూత్రితహారమౌక్తిక
గ్రహణపరాయణంబు లగుఁ గావురఁ దన్మతిభ్రాంతతారకా
గ్రహములఁ జంచులం గమిచి క్రాయుఁ బురిం జిఱుప్రోదిపార్వముల్.

8

ద్విజాదివర్ణనము

క.

క్రతుభుజులకు గృహపాచకు, లతిగూఢ బ్రహ్మనిధికి నాజనికులు భా
రతికిం బేరోలగములు, ప్రతిలే కలరుదురు పురము బ్రాహ్మణవర్యుల్.

9


శా.

పౌనఃపుణ్యముచేతఁ గాని రిపులన్ భంజింప లేఁ డయ్యె భూ
దానం బొక్కటి గాని షోడశమహాదానంబులుం జేయ లేఁ
డేనీతిన్ జమదగ్నిరాముఁడు సముం డిద్ధప్రసిద్ధోన్నమ
ద్దానక్షాత్రగుణంబులం బురవరాంతఃక్షత్రియశ్రేణికిన్.

10


ఉ.

లేకి నిధివ్రజంబు లవలేశము కాంచనభూధరంబు ర
త్నాకరరత్నరాసు లడిగంట్ల మరున్మణికామధుక్సురా
నోకహముల్ క్రయోచికవినూతనవస్తువు లిట్టి వట్టి వ
న్వాకుల కందరానిపురవైశ్యులసంపద లెన్నిచూపుచోన్.

11


క.

ప్రతివర్షంబును ధర ను, ద్ధతిఁ బడియెను పిడుగు లెల్లఁ దగఁ గూర్చి నరా
కృతులుగ ననఁగూర్చె నొకో, శతధృతి యన వీట సుభటసంఘము వొలుచున్.

12


సీ.

అవలీలమై నెట్టియవనీరుహము లైనఁ, బెఱుకుట యెలదూండ్లు వెఱికినట్ల
కొమ్మలతుదఁ క్రొచ్చి కులశైలతటు లైనఁ, గూల్చుట నదిదరుల్ గూల్చినట్ల
యున్మత్తవృత్తిమై నుదధిసప్తక మైనఁ, గలఁచుట మడుగులు గలఁచునట్ల
బలిమి నెంతటి యనిఁ బర సైన్యతతుల మ, ట్టాడుట తుంగలో నాడునట్ల


గీ.

 కాఁ జరించుచుఁ దమయందుఁ గలుగురౌద్ర, రసము లుత్కటమై వెలి నెసఁగుమాడ్కిఁ
గోపమదధార లనిశంబు గురియుచుండ, పఱలుఁ బుగివారణము లనివారణములు.

13


సీ.

కట్టడిఁజెలియలికట్టయె కట్టగా, బిగువుమైఁ బేరెంబు వెట్టకుండ
లంఘరలాఘవోల్లసనంబుమై మొక్క, లించి వార్ధులు చౌకళింపకుండ
బిట్టుదిగంతముల్ ముట్టఁజూపినవిధి, పవమానుగడ తెగఁబాఱకుండ
భరతాభినయముల నిరపేక్షగా లోక, దృష్టులు దనియ నర్తింపకుండ


గీ.

రయముచేఁ జిత్తగతుల గెల్చియును బతుల, మతులలోనన వర్తింప మాకు వలసె
ననుచు సిగ్గునఁ దలవంచుకొనినవిటులొ, యనఁగఁదగి యొప్పుఁ బురి నుత్తమాశ్వతతులు.

14