పుట:కవికర్ణరసాయనము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఉల్లము చల్ల నయ్యె మొద లూడె మనోరథముల్ జగంబుపై
నొల్లమి పుట్టె చేరుగడ నొందితి నీశుభదివ్యవిగ్రహా
భ్యుల్లసనావలోకనసుఖోదధిలోపల నోలలాడుచుం
దొల్లిటివాఁడఁ గానిగతిఁ దోయరుహేక్షణ! సంతసించెదన్.

211


చ.

తెలియనిధూర్తవర్తనులు తెంపరు లై తమయుక్తిభంగులన్
బలుకుట గాక నిక్కముగ భక్తివశుం డగునిన్నుఁ జూడఁ గాఁ
గలుగుటకంటె నొండొకసుఖంబును గల్గునె? కల్గ నిమ్ము! నా
తలఁపున కింపు గా దిదియ తప్పక కల్గ ననుగ్రహింపవే!

212


క.

అని భక్తిపరతఁ గ్రమ్మఱ, వినతుం డగునృపునిఁ జూచి విశ్వైకగురుం
డనుకంపమై ఘనాఘన, ఘనగర్జాస్వరవిధావికస్వరఫణితిన్.

213

శ్రీమన్నారాయణుండు మాంధాత ననుగ్రహించుట

తే.

కువలయేశ్వరచంద్ర! నీ కోరినట్ల, మోక్షఘంటాపథం బైనమునివరైక
దుర్లభాస్మత్పదాంబుజోద్భూతభక్తి, గలుగు నీ కింక నా యనుగ్రహమువలన.

214


వ.

అస్మదీయమాయావిమోహితం జైనజగజ్జనంబు యథార్థంబున న న్నెఱుంగను మత్పద
ప్రాప్తిరూపమోక్షంబు గొనను నెఱుంగదు. నీకు మదీయమాయాజయంబును మత్పద
ప్రాప్తిపాధనం బైన మదీయపదభక్తియు నొసంగితి నెప్పటిగతి రాజ్యపరిపాలనంబు
సేయుచు మద్భక్తియోగనిష్ఠుండ వై యుండు మని కృపావలోకనసుధాధారల నభిషి
క్తునిం జేసి భగవంతుం డంతర్ధానంబు నొందినం గృతార్థుం డై.

215


శా.

చేసెం భ్రాజ్యము గాఁగ రాజ్యము నృపశ్రేష్ఠుండు ధీనిష్ఠుఁ డై
త్రాసాపాదితదోషదూరఫణరత్నద్రత్నగర్భాసము
ద్భాసిస్వీయభుజాభుజంగమనిపీతక్రూరవీరారికాం
తాసోల్లాసవిలాసహాసనికరోదంచత్పయఃపూరుఁ డై.

216


క.

కవితావిచక్షణత గల, కవి కంఠవిభూషణముగఁ గైకొనవలయుం
౧వివరనృసింహవిరచిత, కవికర్ణరసాయన మనుకావ్యము దీనిన్.

217

ఆశ్వాసాంతము

శా.

ప్రస్తుత్యప్రవిఫుల్లహల్లకరుచిస్పర్ధాళుహస్తాభయ
ప్రస్తారప్రతిభారితానతనమఃపర్యాయనాదోద్యమ
ప్రస్తావోద్గమకప్రతీకవిలసత్ఫాలస్తలాద్రిస్ఫుట
త్కస్తూరీతిలకోపలక్షితదళత్కల్హారవారత్రపా.

218