పుట:కవికర్ణరసాయనము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

దళితమహేంద్రనీలరుచిదాయకవిగ్రహ! నీగభీరతా
జలనిధిభావముం దెలుపఁ జాలినలక్షణలక్షితంబు లై
యలవడెఁ గంకణాంకితము లై సముదంచితశంఖచక్రసం
కలితము లై యభంగపరిఘాసమతుంగభుజాతరంగముల్.

203


చ.

తనసుషమావిశేషములఁ దప్పక శంఖములం జయించుటం
దనికినకీర్తిరేఖలవిధంబున నుజ్జ్వలకాంతిఁ బొల్చునీ
యనుపమతారహారబతికాపరికల్పితవేల్లనంబుచేఁ
గనుఁగొన నొప్పు నీ కిపుడు కంధరకంధరవర్ణబంధురా!

204


చ.

వెడవెడ క్రొత్తక్రొత్తమొగి విచ్చినకెందలిరాకుఁ గెంపు చూ
పెడుజిగి గల్గునీయధరబింబమరీచులు దొంగలింప నీ
బెడఁగు వహించునెమ్మొగముపేరిటిపున్నమచందమామకున్
సడలనిదట్టపుంబొడుపుఁజాయ ఘటించెడు నంబుజోదరా!

205


చ.

తిలకితదంతకాంతు లనుతీవమెఱుంగులు సుస్వరాఖ్యగ
ర్జలు గలనీవచోమృతరసంబులు పైఁ గురియంగ నామదిం
గలభవతాప మెల్ల విడి గ్రమ్మవె యంగకదంబకంబులం
బులకనవాంకురంబు లివి పొం దగురీతి గదా! గదాధరా!

206


ఉ.

ముద్దులు గుల్కునీభువనమోహనకుండలరత్నదీధితు
ల్గద్దఱిలాగు మై ధళధళం బొలుపారెడుభంగిఁ జూడఁ గాఁ
దద్దయుఁ జెన్ను మీరెడుఁబదప్రణతావనకేళిలోల! నీ
నిద్దపుఁ జెక్కుటద్దముల నిల్వక జాఱుచుఁ బ్రాఁకుకైవడిన్.

207


ఉ.

క్రొవ్వున మచ్చరించి తుద గూడక వే శరణార్థిబుద్ధితో
నివ్వటిలంగ నీమొగము నెమ్మదిఁ జొచ్చి వెలుంగుమవ్వపుం
గ్రొవ్విరితెల్లతామర లోకో! యనఁ గాఁ దగి చక్రహస్త! లే
నవ్వు దొలంకునీదునయనంబులు నామదిఁ జూఱలాడెడిన్.

208


ఉ.

నాసిక పేరిమవ్వపుటనంటికిఁ బైబొమ లాకు లయ్యె ను
ల్లాసము చూపులేఁతమొవులాగు మెయిం దిలకంబు గల్గెడుం
బ్రాసవగంధ మింకు నని బంభరడించకపఙ్క్తి చేరున
ట్లై సకలేశ! నీదునిటలాలకజాలక మింపు గొల్పెడిన్.

209


చ.

అభయవితీర్ణిధుర్య! కరుణామృతవర్షము చూపుమేఘస
న్నిభుఁ డగునీకు నీవివిధనిర్మలరత్నకిరీటభూషణ
ప్రభలు ఘటించు చున్నయవి భక్తమయూరమహోత్సవంబు గా
నభినవపాకశాసనశరాసనసృష్టికళాకలాపముల్.

210