పుట:కవికర్ణరసాయనము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మై విన్నవింప విను టిది, మావలనం గలుగునట్టిమన్ననఁ గాదే!

186


క.

మాంధాతృమహీపతి దృఢ, సంధామతి మగ్రతపము సలుపఁగఁ దత్తే
జోంధీభూతం బై ని, ర్బంధంబునఁ బొందినది ప్రపంచం బెల్లన్.

187


ఆ.

ఇంద్రపదము నొండె నితరపదం బొండె, నతని కెద్ది యిష్ట మది యొసంగి
భువన ముద్ధరింప నవధరింపుము దేవ!, యిదియె మనవి మాకు నిప్పు డనిన.

188


వ.

దరహసితలసితవదనారవిందుం డగుచు మత్పదభక్తుం డైనయతనివలన నొరుల కెవ్వరికిం
గీడు పొంద దట్లగుట నిశ్శంక మరలి చనుఁ డిదె యతనితపంబు నివారింపుదు నని
కృపావలోకనంబునం బరితృప్తులం జేసి యనిపినం గృతార్థు లై మహేంద్రాదిబృం
దారకముఖ్యు లానందంబున నానందకపాణి కంతంతం బునఃపునఃప్రణామంబు లాచ
రించి వెడలి నిజనివాసంబులకుం జని యనంతరంబ.

189


సీ.

దివ్యవిగ్రహకాంతి దిగ్వధూవితతికి, హరినీలవల్లరు లభినయింపఁ
బేరురంబునందు బెడఁ గైనకౌస్తుభం, బెల్లచోఁ గలయ నీరెండ గాయఁ
బింజించి కట్టిన బిగువపచ్చనిపట్టు, తొలుకారుమెఱుఁగులఁ దుఱఁగలింప
నిడుదహస్తములఁ బూనినశంఖచక్రంబు, లినచంద్రదీప్తుల నీనికొనఁగ


గీ.

శిరసుమకుటంబు నింగిఁ జిత్తరువు గొలుప, గల్లములఁ గుండలద్యుతి వెల్లి గొనఁగఁ
గలికితెలిసోగకన్నులఁ గరుణ చిలుక, జనవరునిమ్రోల శౌరి సాక్షాత్కరించె.

190


వ.

ఇట్లు గరుడవాహనరూఢుండై యారూఢదివ్యమునిసేవ్యమానుం డై యఖిలభువనా
వనదక్షుం డై పుండరీకాక్షుండు ప్రత్యక్షం బగుటయు.

191


శా.

హర్షాశ్చర్యభయంబు లుప్పతిల సాష్టాంగంబు మ్రొక్కి యు
త్కర్షింపంగఁ దరంబు గానియొకయంతస్సౌఖ్యమున్ బొందిపై
వర్షింపం బ్రమదాశ్రుపూరము కరద్వంద్వంబు నొక్కొంత గా
శీర్షంబుం గదియించి సాంద్రపులకశ్రేణీపరీతాంగుఁ డై.

192

మాంధాత శ్రీమన్నారాయణుని స్తుతించుట

దండకము.

శ్రీ వల్లభా! గల్లభాగద్వయీదర్పణాత్యర్పణాలోక! లోకత్రయత్రాణలీలాకళా
దక్ష! దక్షాత్మజాభర్తృచూళీపరిష్కారమందారమాలాభవత్పాదనిర్యత్పయోధార! ధా
రాసహస్రాంశుదీప్తప్రభాభారమారీకృతారాతిదైతేయనాథావరోధాంజనధ్వాంత
సంతాన! సంతానభూజప్రభాపాదపార్థిప్రజాభీష్టవస్తుప్రదానప్రశస్తా! సమస్తాత్మభా
వానుభావంబు నీ వంబుజాతాక్ష! కైకొన్న పైకొన్న నీమాయ నేమా యథామానముం
గానఁగా లేక నానానుసంధానసంధానుబంధానుబంధాంధకారంబుచే ని న్నెఱుంగం
డెఱుంగం దరంబా? భువిం జిత్తగర్తంబునం గర్తృతాహంకృతిన్ జీవబీజంబు సంక
ల్పరూపాంకురం బౌచు నుద్దామకామాదికాండప్రకాండంబు లడ్డంబుగాఁ బుత్రమి