పుట:కవికర్ణరసాయనము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

హరుఁడు శిరంబుపై నిడి సమావరణంబు ఘటించినప్పుడుం
బొరసినకందు కార్శ్యమును బోదొకొ చంద్రున! కీమురారిస
చ్చరణము లాశ్రయించునఖచంద్రులు పూర్ణులు నిష్కళంకులున్
హరిసరియాశ్రయంబు గలదా యని దివ్యులు మెచ్చి రాత్మలన్.

160


వ.

ఇవ్విధంబున నఖిలచేతనచేతోవలోకనలోభనీయసర్వాంగసుందరుండును, నిత్యనిరవ
ద్యనిసర్గదివ్యాద్భుతాచింత్యతారుణ్యలావణ్యమాధుర్యగాంభీర్యస్థైర్యధైర్యాద్యనంత
కల్యాణగుణరత్నరత్నాకరుండును, ఆత్మానురూపసుకుమారసుఖస్పర్శసుగంధబంధుర
దివ్యభూషణభూషితుండును, దివ్యమూర్తిధరపాంచజన్యసుదర్శనకౌమోదకీనందకశా
ర్ఙ్గాదిదివ్యాయుధసేవ్యమానుండును, నిజోత్సంగసంగరమాసమాహితాత్మపరస్పర
నిరీక్షణమధురసార్ద్రప్రణయనవ్యతరదివ్యరసానుభవంబునం గాలంబు నంతర్భ
వింపం జేయుచు, మధురగంభీరభావగర్భితమందహాసవిలాసవికాసితదివ్యవదనా
రవిందశోభానుభావభావితం బగుచు నిగుడునిజదివ్యామలకోమలావలోకనలీలాలస
వాగమృతస్యందంబున నఖిలజనహృదయాంకరంబులు నాపూరితంబులు గావింప, సకల
కార్యకారణైకకారణు నశేషేచిదచిదంతరాత్ముం బరమాత్ము నఖిలేశ్వరేశ్వరు ననీశ్వ
రు నఖిలైకసాక్షి నఖిలవాఙ్మానసగోచరామేయప్రభావు నిఖిలహేయప్రత్యవీకుం
గళ్యాణగుణైకతానస్వరూపుం బురాణపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు సమస్త
చేతనైకాభిగమ్యు సర్వప్రకాశైకనిరతిశయభోజ్యు నాశ్రితవత్సలు నాపత్సఖు ననాథ
నాథుం గృపాలీలాపరాయణు శ్రీమన్నారాయణుం గాంచి, మహేంద్రాదిబృం
దారకు లాపాదచూడంబు నాచూడపాదంబునం గాఁ దదఖిలావయవమబుల వెల్లివిరి
యునమందసౌందర్యసముత్తేజసద్యోలావణ్యామృతరసపూరంబు నాత్మీయనిశ్చలదృష్టి
నాళంబుల వెక్కసంబునం గ్రోలుచు నిరస్తసమస్తాంతస్తాపులు నిస్సీమపరమానందజలధి
నిమజ్జమానాంతరంగులుం బ్రకృష్టసంతోషబాష్పధారాప్రాలంబచుంబితోరస్కులుం
బ్రహృష్టరోమాంచకంచుకితసర్వాంగులు నగుచు నత్యంతసాధ్వసవినయావనతసర్వాం
గంబులతోఁ దదీయదివ్యపదపీఠోపాంతప్రదేశంబుల నంతంతం బునఃపునసాష్టాంగ
దండప్రణామంబు లాచరించి లేచి ఫాలకీలితాంజలిబంధంబులతో గద్గదకంఠంబు
తో నిట్లని వినుతించిరి.

161

దేవేంద్రాదులు శ్రీమన్నారాయణుని స్తుతించుట

భుజంగప్రయాతము.

నమస్తే సమస్తైకనంతవ్యమూర్తే, నమస్తే సమస్తన్యనాద్యంతకీర్తే
నమస్తే ప్రశస్తోల్బణజ్ఞానమూర్తే, నమస్తే నిరస్తాంఘ్రినమ్రాఖిలార్తే.

162