పుట:కవికర్ణరసాయనము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మధుకైటభకుటిలాసుర, రుధిరార్ద్రము లైననాఁటిరూపము దెలిపెన్
మధుమథనుతొడలు కాంచీ, మధురారుణమణిమరీచిమహితము లగుచున్.

151


క.

అభ్రశ్యామలహరికటి, విభ్రాజత్కనకశాటి వీక్షకులకు న
య్య భ్రంకషకనకనగో, దభ్రద్యుతివిభ్రమంబు దలఁపం జేసెన్.

152


క.

శతమఖముఖులకు నిరలం, కృతి యయ్యును నింపు గొలిపె కృష్ణునిజంఘా
ద్వితయ మది యట్ల వృత్తో, న్నతులకు మఱి వేఱ భూషణంబులు గలవే?

153


సీ.

వీనిచెల్వము వార్త విన్నభయంబున, వ్రీహిగర్భంబులు విరియకున్నె?
కొమరెల్ల వీని చేఁ గోల్పడ్డకాహళు, లీశులకడ మొఱ లిడక యున్నె?
యెదిరి వీనికి నిర్వహింపనికాళాంజు, లొరులతమ్మలకు నో రొగ్గ కున్నె?
యొప్పిదంబున వీని కోడినశరధులు, హృదయశల్యవ్యథ నెరియ కున్నె?


గీ.

సోయగముచేత బటు వైనసొబగుచేతఁ, బోల్ప నొండొంటిఁ దమలోనఁ బోలుఁ గాక
వీని కుపమాన ముండునే వేఱ? యనుచు, విభునిజంఘలఁ బొగడి రవ్విబుధవరులు.


తే.

ఆదిపూరుషదివ్యనానాఖిలాంగ, పథపథిక మైనదేవతాపతులచూడ్కి
చేరుగడ యైనతత్పదాంభోరుహములఁ, జెంది చరితార్థభావంబు నొందె నపుడు.

155


సీ.

పరమనిత్యైకాంతభక్తసర్వస్వంబు, జలజాలయాహస్తసౌఖ్యసాక్షి
ప్రాభాతికాంబుజప్రస్పర్ధమానార్థి, శింజానవేదమంజీరకంబు
దీనరక్షావిధాదీక్షాకృతక్షణ, మాపవర్గికనిరస్యైకపదవి
సంతతశ్రుతిశిఖాసంసృగ్యమాణంబు, శాంతసంయమిజనస్వాంతసుఖము


గీ.

కరతలోచ్చయసకలార్థికల్పకంబు సకలచేతనమూర్ధవాస్తవ్యకంబు
వేలుపులచూడ్కి నొడిచి దక్కోలుగొనియెఁ, బరమపురుషుని శ్రీపాదపద్మయుగము.

156


ఆ.

లీల నంగుళీప్రణాళీముఖంబులఁ, బ్రణతజనుల కమృతరసము గురియు
నదియ కాఁ దలంచి రమరులు నఖరుచి, స్ఫురిత మైనవిష్ణుచరణయుగము.

157


చ.

పరుసన కల్పకప్రథమపల్లవముల్ మలినంబు శోణసం
స్ఫురదరవిందరాగరుచిపుంజము సంకుచితంబు శారదాం
బురుహకులంబు దీనిగుణముల్ ప్రకటించినచోట నంచుఁ ద
చ్ఛరణతలద్వయంబునకు జాతమహాద్భుతు లైరి దిక్పతుల్.

158


సీ.

విశ్రాణనాభ్యాసవిధికిఁ గల్పనగంబు, వికసనావేశంబు వినఁగఁ దమ్మి
శ్రితతాపహృతి నేర్చుమతి నాతపత్రంబు, త్రిజగజ్జయక్రియ దెలుపఁ బడగ
చిత్రశౌర్యంబు నేర్చికొనంగ వజ్రంబు, నవనతాలంకృతి కరిదరంబు
లకులలావణ్యసుబాబ్ధిఁ గాన ఝషంబు, నైశ్వర్య మెఱిఁగింప నంకుశంబు


గీ.

నాశ్రయించి యున్న నగు నిక్క మిది యని, యుల్లములు దలిర్పనూహ చేసి
రమరవరులు విభునియంఘ్రితలంబులఁ, జెన్నుమిగులుకుశలచిహ్నములకు.

159