పుట:కవికర్ణరసాయనము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కదిసి యంతఃప్రదేశంబు గాచి యున్న, సనకముఖ్యమహాకవిసంస్తవముల
మొదలిశ్రీకారములశంక నొడవఁ జేసె, దేవదేవునివీను లాదివ్యతతికి.

139


క.

ఆకృతిసామ్యము గల దని, కాకు న్నెనయించు దీని ఘననిస్వన మెం
దాకరముచిందమున కని, శ్రీకాంతుగళంబు నూహ చేసిరి ఖచరుల్.

140


క.

సరసశ్రీభూనీలా, సరళభుజాగ్రహణనియతసంస్థానపుసం
స్కరణ మని తోఁచెఁ జూపఱ, కరు దై రేఖాత్రయంబు హరికంఠమునన్.

141


క.

సురకరికటమదరేఖా, దరసరణీయద్రులతలఁ దలపించె నభ
శ్చరులకు శార్ఙ్గజ్యాకిణ, పరిచిహ్నితవిష్ణుదీర్ఘబాహార్గళముల్.

142


చ.

ప్రణయకృతోపధానవిధిఁబ్రాప్తము లైనరమాకళావతీ
మణిమయకర్ణకుండలవిమర్దనముద్ర లయత్నసిద్ధభూ
షణములు గాన నమ్రజనసంభరణంబులయందు బద్ధకం
కణములు గా నెఱింగి మురఘస్మరుబాహువులన్ సురావళుల్.

143


తే.

దీర్ఘదీర్ఘంబు లగురమాధిపుని బాహు, లతలఁ దిరిగి పరిశ్రాంతిగతము లైన
వేల్పుఁ బ్రోడలచూడ్కులు విశ్వవిభుని, వెడఁదనిద్దంపుటురమున విశ్రమించె.

144


మ.

సురరక్షార్ధకవాట మైనహరివక్షోవీథి రక్షోభటో
త్కరశస్త్రాస్త్రనిపాతరేఖల నలంకారంబు గా నెన్ని త
త్పరభావప్రథమానచిహ్నములు గా భావించి రీక్షాపరుల్
సిరినిం గౌస్తుభరత్నహారతులసీశ్రీవత్సచిహ్నంబులన్.

145


తే.

తాఁ గృశత్వంబు నొంది సౌందర్యమునకుఁ, బూర్ణభావంబు గొల్పెడుపుండరీక
నయనుమధ్యంబు పశ్యజ్జనంబు పొగడెఁ, బరమపదపోషకులు పేదవడియుఁ దగరె.

146


క.

ఉదరస్థితిలోకత్రయ, పదజనిపరిదృశ్యమానపార్థక్యం బై
త్రిదశాధిపదృష్టివశం, వద మయ్యె మురారిత్రివళివలనం బచటన్.

147


ఉ.

మువ్వురు దేవత ల్సములు మువ్వురు నేకమ వేఱతత్వ మీ
మువ్వురకంటె మీర దను ముగ్ధుల నాత్మవికారరేఖచే
నవ్వువిధీశహేతుహరినాభిపయోజముచే నెఱింగినా
రవ్విభుదృష్ట్యధీనము తదన్యసమస్తము నౌట వేలుపుల్.

148


తే.

బహుమహల్లహరీవిజృంభణమువలనఁ, ద్రిజగదంతర్ధి యగురమాధిపమహాబ్ధి
మధ్యభాగంబునందు నున్మజ్జదవని, పద్మ మని తోఁచెఁ దన్నాభిపద్మ మపుడు.

149


క.

తనచెలువున గెలిచి జయం, బున నొక శ్రీభూమికరభములచే సంవా
హనరూపసేవ గొనియెడు, నని విభునిమృదూరుయుగళి నరసిరి దివ్యుల్.

150