పుట:కవికర్ణరసాయనము.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పదమసుకుమారవిగ్రహస్పర్శనమునఁ, బూరుషోత్తముదివ్యవిభూషణములు
పులకితము లైన వని రుచిస్ఫూర్తివలన, విస్మయంబున మునిఁగి రవ్విబుధవరులు.

126


ఉ.

పానుపుఁబాముభోగరుచిఁ బర్వెడువెన్నెలవెల్లిచేత స
న్మానము గాంచి యంతికరమాతనుకాంతినవాతపంబుచే
గానుక లంది వేల్పులకుఁ గ్రమ్మగఁ జేసె మహాద్భుతంబు నా
సూనకులాస్త్రుతండ్రి నునుసోయగపుంజిగిచిమ్మచీఁకటుల్.

127


తే.

చిదచిదధిరాజభావైకచిహ్న మైన, కైటభారాతిరత్నకిరీటమునకు
సాహసాక్రమణక్రీడ సలుపఁ బోయి, ఖచరతతిచూడ్కి రశ్ములఁ గట్టుపడియె.

128


క.

చరణవినతాస్మదాదులఁ, గరుణ విలోకించునపుడు కాని యవనతిం
బొరయనియది యిది పొ మ్మని, సురవరు లసురారిమౌళిఁ జూచిరి వేడ్కన్.

129


క.

వరమకుటరత్నకిరణ, స్ఫురణ ప్రతిఘట్టనమున భుగ్నాగ్రము లై
మరలి తనుద్యుతు లనుమతి, నెరపె సుపర్వులకు విభునినిటలాలకముల్.

130


ఉ.

అచ్చుగఁ బోరిపోరి సగ మై జయ మేది రమాధిపాస్యముం
జొచ్చినచంద్రు గాఁ దలఁచి చూచిరి ఫాలము నోడి తారునుం
జొచ్చిన పంకజంబు లని చూచిరి నేత్రయుగంబు భీతిమైఁ
జొచ్చిన దర్పణంబు లని చూచిరి చెక్కుల దేవతావరుల్.

131


క.

లోలవిలోచనసతతో, ద్వేలకృపాపూరమృదులవీచుల యని ర
వ్వేలుపుఁబ్రోడలు శేషశ, యాళునిఁగఱివంకబొమలయాకృతిఁ గనుచోన్.

132


క.

సురుచిరలావణ్యామృత, సర మగువక్త్రమునఁ జపలచక్షుశ్శఫర
స్ఫురణమున నొలయుతరఁగలఁ, బురుణించిరి సురలు విభుని భూవిభ్రమముల్.

133


తే.

తెగున లంఘించి తలచుట్టుఁ దిరిగినవియొ నిక్కముగ వీను లనధిగా నిలిచినవియొ!
తెలియరా దని మతుల సందియము నొంది, రమరు లవ్విభుదీర్ఘనేత్రములు చూచి.

134


క.

కేవలకరుణావిషయం, బీవిశ్వము గాన విషయ మెఱుఁగమి నికటీ
భావము నొందనివిష్ణు, భ్రూవల్లులు చూచి ముదముఁ బొందిరి దివ్యుల్.

135


క.

తిలకోర్ధ్వపుండ్రకల్పక, విలసన్ననమూలకాండవిభ్రమ మన నా
జలరుహలోచనునాసిక, బలభిత్ప్రభృతులకుఁ జూడ్కి పండువు చేసెన్.

136


క.

సితదశనకుందకలిత, స్మితలతికాపల్లవంబు చెలువున నరుణ
ద్యుతిమధుర మైనకవులా, పతియధరముఁ బ్రీతిఁ దేల్చెఁ బశ్యజ్జనమున్.

137


తే.

కమలనాభకపోలరంగములయందు, మకరకుండలమణివిభామందహాస
నవవధూవరపరిణయోత్సవమునపుడు, క్రతుభుజులచూడ్కి పెండ్లిపేరఁటము సేసె.

138


తే.

కర్ణకుండలప్రతిబింబగర్భవతులు, గాన సుస్మితపాండూయమానముఖము
లగుట వీనికిఁ దగు నని హరికపోల, రేఖలకుఁ బ్రీతిఁ బొందిరి లేఖవరులు.

139