పుట:కవికర్ణరసాయనము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

 సంభవించె నపూర్వషట్పదీగీతులు, లలితమంజీరఝళంఝళములు
ప్రాపించె నభినవపరభృతారవములు, కాకలీవ్యాహారకలకలములు
బుగులుకొనె నవీనపుష్పసౌరభములు, గుంభితాస్యామోదఘుమఘుమములు
కలిగెఁ దద్ధ్వనికి నుజ్జ్వలపల్లవద్యుతుల్, శయకుశేశయవికాసచకచకలు


తే.

భూవరాన్వయతిలకతపోనివాస, మగుట నొదవినభాగ్యోదయమునఁ బోలె
నపుడు సరయూనదీతీరవిపినమునకు, నమరపురవారలలనాసమాగమమున.

79


వ.

ఇట్లు తపోవనప్రాంతంబున విడిదిగా విడిసి.

80

మాంధాతృతపోవనంబున రంభాదులు శృంగారక్రీడ లొనర్చుట

మ.

కర మాశ్చర్యము గాఁగ నచ్చరలు శృంగారోజ్జ్వలాకారు లై
సరసక్రీడలఁ జొచ్చి రానృపతపస్సంస్థాన ముచ్చైరట
చ్చరణాంభోరుహనూపురధ్వనుల నాశ్చర్యానుమోదంబు లై
హరిణీసంఘము దర్భగర్భితముఖవ్యావృత్తి నాలింపఁగన్.

81


సీ.

పరిమళం బంటక పరువంపుమొగ్గల, కెలయించుతనుగాలిపొలసమునకుఁ
దమలోన జాతివైరము డించి దూర్వముల్, మెట్టనిమృగజాతిమెలఁకువలకుఁ
బక్వసార్వర్తుకఫలపుష్పములు గల్గు, తరువులనీడలు దరలమికిని
బగలు రే మొగుడనితొగలఁ దమ్ములఁ గ్రాలు, కొలఁకులు గడ లెత్తి కలఁగమికిని


తే.

వెఱఁగు దనుకంగ నిజతపోవిభవ మాత్మ, మెచ్చి పొగడుచుఁ జనుదెంచునచ్చరలకుఁ
జిత్తవీథుల జనియింపఁ జేసి శంక, నపుడు గనుపట్టె యువనాశ్వనృపతిపట్టి.

82


ఉ.

చెంతల నంతరాయ మనుచీఁకటి పైకొననీక తేజ మా
క్రాంతదిగంత మై వెలయ గాడుపు సోఁకనిదీపమట్ల వి
శ్రాంతసమాధిసంగతి నచంచలుఁ డైనతపస్వియందుఁ ద
త్కాంతలయత్నముల్ విఫలకార్యము లై విలసించె నయ్యెడన్.

83


చ.

ఒకయడు గెత్తి జంగ యిడ నూరురుచుల్ తలచూపఁ దీవ యం
దుకొన నిగుడ్చుట న్వికచదోర్లతమూలము చూడ్కి చూఱగా
నకనక కౌను సాఁగి నదినాభి బయల్పడ నీవి జాఱ మీఁ
దికి మొగ మెత్తి యొక్కసుదతీమణి చేరువఁ గోసిఁ గ్రొవ్విరుల్.

84


చ.

పదముల కెంపునన్ బయలు పల్లవితంబుగ రాకపోకలన్
వదనముతీవఁ జందురునివైఖరి చూపఁగ దూఁగఁచూఁగఁ బ
య్యద పలుమాఱు గాలి నెగయం జనుగుబ్బలు తొంగిచూడఁగాఁ
ద్రిదశవధూటి వేరొకతె తీవల నుయ్యల లూఁగె వేడుకన్.

85